విజయారెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై విష్ణు అసంతృప్తి

విజయారెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై విష్ణు అసంతృప్తి
  • తన సోదరి పార్టీలో చేరుతున్నట్లు చెప్పలేదని విష్ణువర్ధన్​రెడ్డి ఆవేదన
  • పార్టీ నేతలను లంచ్​కు పిలిచి సమాలోచనలు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​లో చేరికలు లీడర్ల నడుమ గ్యాప్​పెంచుతున్నాయి. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఆయా ప్రాంతాల నేతలను పార్టీలోకి చేర్చుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఖైరతాబాద్​ కార్పొరేటర్, పీజేఆర్ ​కూతురు విజయా రెడ్డి చేరిక ఇలాంటి చిచ్చునే పెట్టింది. విజయా రెడ్డి సోదరుడైన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్​రెడ్డి ఈ చేరిక పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సోదరి పార్టీలో చేరుతున్నట్లు తనకు ఎలాంటి సమాచారంలేదని ఆయన స్వయంగా చెప్పారు. ఆమెను ఏ నియోజక వర్గం నుంచి బరిలో దింపుతారనేది కూడా పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలతో విష్ణు పార్టీ మారుతారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే విష్ణు సోమవారం కొందరు పార్టీ నేతలను లంచ్​కు ఇంటికి పిలిచారు. రెండు రోజుల ముందు విష్ణు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో కొందరు సీనియర్​ నేతలను కలిశారు. వారి ముందు ఆయన తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యపై చర్చించేందుకు పార్టీ ముఖ్య నేతల్ని లంచ్​కు పిలవాలని వారు విష్ణుకు సూచించారు. అక్కడ అన్నీ మాట్లాడవచ్చని సలహా ఇచ్చారు. దాంతో విష్ణు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ప్రచార కమిటీ చైర్మన్​మధు యాష్కీ, ఏఐసీసీ స్పోక్స్​పర్సన్​దాసోజు శ్రవణ్​కుమార్, వర్కింగ్​ప్రెసిడెంట్లు మధు యాష్కీ, జగ్గారెడ్డి, సీనియర్​నేత వీహెచ్​తదితరులను లంచ్ కు ఆహ్వానించారు. రేవంత్, భట్టి ఢిల్లీలో ఉన్నందున ఈ కార్యక్రమానికి రాలేదు. కాగా ఇతర నేతలు హాజరై విష్ణుకు అనుకూలంగా మాట్లాడారు. తాము విష్ణుకు అండగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు. 

జెండా మోసినోళ్లకే చాన్సియ్యాలె: మధు యాష్కీ
పార్టీని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం చేయవద్దని, కష్టకాలంలో జెండా మోసే వాళ్లకే అవకాశం ఇవ్వాలని మధు యాష్కీ మీడియాతో అన్నారు. టికెట్​ఇస్తేనే వస్తామన్న వాళ్లను పార్టీలోకి తీసుకోవద్దన్నారు. విష్ణు సేవలు హైదరాబాద్​లో ఎంతో అవసరమని, ఆయన తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. పీజేఆర్​ తుది శ్వాస వరకు కాంగ్రెస్​ను అంటిపెట్టుకొని ప్రజల కోసం పని చేశారన్నారు. కాంగ్రెస్​లో భారీగా చేరికలు జరుగుతున్నాయని, అయితే వీటి వల్ల ఇంత కాలం పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరగొద్దన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ బలపడుతున్నందునే ఇతర పార్టీల నుంచి నేతలు మళ్లీ వస్తామంటున్నారని మధు యాష్కీ అన్నారు. 

రాహులే నాకు బాస్: విష్ణు
ఈ భేటీపై విష్ణు మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్​లో ఎప్పడూ యాక్టివ్​గానే ఉన్నానని, తమకు రాహుల్​గాంధీయే అసలైన బాస్​అన్నారు. తన సోదరి విజయారెడ్డి చేరిక విషయంలో తననెవరూ సంప్రదించలేదని చెప్పారు. ఆమె విషయంలో తమ కార్యకర్తలు ఎట్లా చెబితే అట్లా నడుచుకుంటానన్నారు. తనను ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తానన్నారు. రేవంత్​రెడ్డితో తనకెలాంటి గ్యాప్​లేదనీ, లంచ్​కి ఆయనను కూడా పిలిచినట్లు చెప్పారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్​ మనిషినేననీ, వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.