
హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా'. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకుడు. ఈ సినిమా భారీ తారాగణం, ప్రముఖ సాంకేతిక నిపుణులతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ల అందం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానుంది. జి. నాగేశ్వర్ రెడ్డి కథ అందించిన ఈ చిత్రానికి.. కోన వెంకట్ స్క్రిప్టు అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను వదిలారు మేకర్స్.
ఈ టీజర్ లో జిన్నా టెంట్ హౌజ్ ఓనర్ గా మంచు విష్ణు కనిపించాడు. జిన్నా టైంకు రావడంతో పాటు బ్యాడ్ టైంను కూడా తీసుకొస్తాడు అంటూ విష్ణు క్యారెక్టర్ ను పరిచయం చేశారు. ఊరంత అప్పులు చేసిన పనికిమాలిన వాడిగా అతని గురించి చెప్పుకుంటారు. అప్పుల బాధ నుంచి బయట పడేయడానికి సాక్షాత్తూ లక్ష్మీ దేవి రావాలని అనుకుంటుండగా.. విష్ణు లైఫ్ లోకి ఎన్నారై సన్నీలియోన్ ఎంట్రీ ఇస్తుంది. ఆమె రాకతో జిన్నా టైం స్టార్ట్ అయిందని అనుకుంటుండగా.. కథలో ట్విస్ట్ ని చూపించారు. సన్నీలియోన్ శరీరంలోకి ఓ ఆత్మ ప్రవేశించినట్లు టీజర్ లో చూపించారు. నన్ను చంపేస్తావా బాబాయ్ అంటున్న ఆ దెయ్యం వెనుక కథ ఏంటి?.. దాని బారి నుండి హీరోయిన్ ని విష్ణు ఎలా కాపాడాడు? అనేది 'జిన్నా' సినిమా చూస్తేనే తెలుస్తుంది.