విజన్ 2047 అభివృద్ధికి రోడ్ మ్యాప్..ప్రపంచానికి సీడ్ బౌల్ గా తెలంగాణ

విజన్ 2047 అభివృద్ధికి రోడ్ మ్యాప్..ప్రపంచానికి సీడ్ బౌల్ గా తెలంగాణ
  • విద్య, ఆరోగ్యం, ఉపాధికి బాటలు.. నెట్ జీరో దిశగా అడుగులు
  • హైదరాబాద్ టు పల్లె.. అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం
  • విజన్​ పాలసీ ముసాయిదాకు తుది మెరుగులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ‘విజన్ 2047’  డాక్యుమెంట్​ రెడీ అవుతున్నది. ఇప్పటికే ముసాయిదా పత్రం తుది రూపునకు రాగా.. అది  రాష్ట్ర భవిష్యత్తు ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తున్నది. వ్యవసాయం మొదలుకొని అంతరిక్ష సాంకేతికత, పల్లె నుంచి పట్నం వరకు ప్రతి రంగాన్ని, ప్రతి ప్రాంతాన్ని స్పృశిస్తూ ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను రచించింది. మన నేల సారాన్ని ప్రపంచానికి చాటుతూ రాష్ట్రాన్ని ‘సీడ్ బౌల్’గా మార్చడమే కాకుండా, ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్‌లో ఏకంగా 8 శాతాన్ని వైద్యానికి కేటాయించాలని నిర్ణయించింది.


భావితరాలను తీర్చిదిద్దేందుకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, యువతకు నైపుణ్యాలతో కూడిన ఉపాధి, పర్యావరణ పరిరక్షణ కోసం ‘నెట్ జీరో’ లక్ష్యాలు, హైదరాబాద్‌‌‌‌పై భారం తగ్గించి జిల్లాలను అభివృద్ధి చేసే వికేంద్రీకరణ విధానం.. ఇలా పంచసూత్రాల ప్రగతి ప్రణాళికతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు సర్కారు కంకణం కట్టుకున్నది. గ్లోబల్ సమిట్ వేదికగా ప్రభుత్వం ఈ దార్శనిక పత్రాన్ని ప్రపంచం ముందుంచనున్నది.  

లాభసాటి వ్యాపారంగా వ్యవసాయం..

వ్యవసాయాన్ని కేవలం సాగుగానే కాకుండా.. లాభసాటి వ్యాపారంగా మార్చేందుకు ‘విజన్ 2047’లో పెద్దపీట వేసింది. మన నేల సారాన్ని, రైతన్న కష్టాన్ని జోడించి రాష్ట్రాన్ని ప్రపంచానికే ‘సీడ్ బౌల్’ (విత్తన భాండాగారం)గా మార్చడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. సంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి పలికి, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ (వాతావరణ అనుకూల సాగు) వైపు రైతులను మళ్లించడం,  వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడం, ఎగుమతుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడమే సర్కారు సంకల్పంగా పేర్కొన్నది.  టెక్నాలజీని వ్యవసాయానికి జోడించడంలో దేశానికే రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలవనున్నది. ‘డిజిటల్ అగ్రికల్చర్’లో భాగంగా ప్రతి రైతుకు భూసార పరీక్షల ఫలితాలను మొబైల్ ద్వారానే అందించేలా ఏర్పాట్లు చేస్తున్నది. ఐఓటీ  ఆధారిత పరికరాలు, డ్రోన్లు, ఏఐ  సాంకేతికతను ఉపయోగించి చీడపీడల నివారణ, నీటి యాజమాన్యం, ఎరువుల వాడకంపై రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వనున్నది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ‘తెలంగాణ అగ్రిటెక్ రీసెర్చ్ కమ్ సర్టిఫికేషన్ సెంటర్’ను ఏర్పాటు చేసి, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించనున్నది. నానో ఎరువులు, బయో పెస్టిసైడ్స్ వాడకాన్ని పెంచడం ద్వారా రసాయన ఎరువుల భారాన్ని తగ్గించనున్నది.   రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తులకు డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వం ‘గ్లోబల్ సీడ్ లీడర్‌‌‌‌షిప్’పై దృష్టి పెట్టింది. ఇప్పటికే విత్తన ఉత్పత్తిలో తెలంగాణకు మంచి పేరుంది. దీన్ని మరింత విస్తరించి, 2047 నాటికి 100 సీడ్ హబ్‌‌‌‌లను ఏర్పాటు చేయనున్నది. విత్తన ఎగుమతులకు ప్రత్యేకంగా ‘ఇన్‌‌‌‌ల్యాండ్ సీడ్ ఎక్స్‌‌‌‌పోర్ట్ ఫెసిలిటేషన్ పోర్ట్’ను ఏర్పాటు చేసి, సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వనున్నది.  

తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్..

చదువు అంటే కేవలం డిగ్రీలు సాధించడం కాదు.. జీవితాన్ని గెలవడం అని రాష్ట్ర ప్రభుత్వం బలంగా విశ్వసిస్తున్నది. అందుకే ‘విజన్ 2047’లో విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు నడుం బిగించింది. అంగన్‌‌‌‌వాడీ స్థాయినుంచి యూనివర్సిటీ వరకు విద్యార్థి ప్రయాణాన్ని ఒక నిరంతర ప్రక్రియగా మలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.  ప్రైమరీ లెవెల్‌‌‌‌లోనే విద్యార్థుల్లో అక్షరాస్యత, అంకెలపై పట్టు సాధించేందుకు ‘స్టేట్ లెర్నింగ్ మిషన్’ను ప్రభుత్వం ప్రారంభించనున్నది. 3వ తరగతి వచ్చేసరికి ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, లెక్కలు చేయడంలో ప్రాథమిక సామర్థ్యాలను సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించనున్నది. అంగన్‌‌‌‌వాడీలను బలోపేతం చేసి, అక్కడి నుంచే పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తూ, వారిని పాఠశాల వాతావరణానికి అలవాటు చేయనున్నది. వెనుకబడిన విద్యార్థులకు మల్టీ గ్రేడ్, మల్టీ లెవల్ బోధనా పద్ధతుల ద్వారా  ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నది. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారాన్ని తగ్గించేందుకు ‘టీచర్ సింప్లిసిటీ చార్టర్’ను అమలు చేయనున్నది.   ప్రతి స్కూల్ కాంప్లెక్స్‌‌‌‌లో కనీస సౌకర్యాలు, డిజిటల్ క్లాస్ రూమ్స్​, క్రీడా మైదానాలు ఉండేలా చూస్తున్నది. ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన గురుకులాలను ఏర్పాటు చేసి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించనున్నది. పరీక్షల విధానంలోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నది. ‘కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్’ విధానాన్ని తీసుకురానున్నది. 10, 12వ తరగతుల్లో బోర్డు పరీక్షల విధానాన్ని సమీక్షించి..  ఏకీకృత ‘తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్’ ను ఏర్పాటు చేయనున్నది. దీనివల్ల సిలబస్, పరీక్షల నిర్వహణలో ఒకే విధానం అమలవుతుంది. అలాగే, ప్రైవేట్ పాఠశాలల నియంత్రణ, నాణ్యతా ప్రమాణాల కోసం ‘తెలంగాణ స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ’ ని ఏర్పాటు చేసి, తల్లిదండ్రులకు ఫీజుల భారం లేకుండా చూడనున్నది. 

‘నెట్ జీరో’ దిశగా వడివడి అడుగులు!

2047 నాటికి ‘నెట్ జీరో’ (కర్బన ఉద్గారాలరహిత) స్థాయికి చేరుకోవాలని సర్కారు ప్రతిజ్ఞ చేసింది. క్లీన్ ఎనర్జీ , ఈవీ, పచ్చని అడవులు, కాలుష్య రహిత నగరాలతో కూడిన ‘గ్రీన్ తెలంగాణ’ను ఆవిష్కరించేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మూసీ నది పునరుజ్జీవం, కూల్ రూఫ్ పాలసీ, భారీగా మొక్కలు నాటడంలాంటి చర్యలతో పర్యావరణ పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్రాన్ని ‘క్లీన్ ఎనర్జీ పవర్‌‌‌‌హౌస్’గా మార్చడమే ప్రభుత్వ మొదటి లక్ష్యం.2030 నాటికి అదనంగా 20వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌‌‌‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం  లక్ష కోట్ల పెట్టుబడులను సమీకరించనున్నది. బొగ్గు ఆధారిత విద్యుత్ స్థానంలో గ్రీన్ ఎనర్జీని, గ్రీన్ హైడ్రోజన్‌‌‌‌ను ప్రోత్సహించనున్నది. పరిశ్రమల్లో వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు ‘కార్బన్ క్యాప్చర్’ టెక్నాలజీని వాడటంతోపాటు కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్  బయటకు తరలించి ‘నెట్ జీరో ఇండస్ట్రియల్ పార్కు’లను ఏర్పాటు చేయనున్నది. వ్యవసాయాన్ని కూడా ‘క్లైమేట్ స్మార్ట్’గా మారుస్తున్నది.  రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా ‘హరితహారం’ స్ఫూర్తితో అడవుల పునరుద్ధరణ, ఆగ్రో ఫారెస్ట్రీని ప్రోత్సహిస్తున్నది. ఇది కార్బన్ సింక్‌‌‌‌గా పనిచేసి వాతావరణ సమతుల్యతను కాపాడుతుంది.

8 శాతం బడ్జెట్‌‌‌‌తో ‘హెల్త్ హబ్’గా తెలంగాణ!

రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రత కోసం ‘విజన్ 2047’లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఏకంగా 8 శాతాన్ని వైద్య రంగానికి కేటాయించాలని నిర్ణయించి, ప్రజల ఆరోగ్యం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నది. పుట్టబోయే బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్యం అందించడమే లక్ష్యంగా మూడు ప్రధాన పిల్లర్స్‌‌‌‌ (న్యూట్రిషన్, మాతా శిశు సంరక్షణ, అసంక్రమిత వ్యాధుల నివారణ) ఆధారంగా హెల్త్ విజన్‌‌‌‌ను రూపొందించింది. జిల్లాలను కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యానికి కేంద్రాలుగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. అంగన్‌‌‌‌వాడీల ద్వారా పోషకాహార కిట్లు, పాఠశాలల్లో ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీని విస్తృతం చేయనున్నది.  ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్  క్రియేట్ చేసి, వారి ఆరోగ్య సమా చారాన్ని భద్రపరిచే ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయను న్నది.  జిల్లాల్లోనే కీమోథెరపీ,  డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది. ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌లైన్లు, కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. 

 ప్రాంతీయ అభివృద్ధికి కొత్త రోడ్‌‌‌‌మ్యాప్‌‌‌‌

రాష్ట్ర  ప్రభుత్వం ‘విజన్ 2047’లో ప్రాదేశిక ప్రణాళికకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రాన్ని 3 జోన్లుగా (కోర్ అర్బన్, పెరి-అర్బన్, రూరల్) విభజించి, ప్రతి ప్రాంతానికి ప్రత్యేక ప్రణాళికను రచించింది. రీజినల్ రింగ్ రోడ్  కేంద్రంగా కొత్త నగరాలను, పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తూ, జిల్లాల్లో అర్బన్ క్లస్టర్లను ఏర్పాటు చేసి అభివృద్ధిని వికేంద్రీకరించనున్నది. భవిష్యత్తులో హైదరాబాద్‌‌‌‌పై భారం పడకుండా, ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లాంటి కొత్త నగరాలను నిర్మించనున్నది. హైదరాబాద్ మహానగరాన్ని (కోర్​ అర్బన్ ఏరియా) విశ్వనగరంగా తీర్చిదిద్దుతూనే, దాని చుట్టూ ఉన్న పెరి-అర్బన్  ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌‌‌‌గా మార్చనున్నది. ‘రేడియో సెంట్రిక్’ (చక్రం ఆకారంలో) రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూ, 11 రేడియల్ రోడ్లు, 5 రింగ్ రోడ్లతో రాష్ట్రాన్ని అనుసంధానించనున్నది. దీనివల్ల రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతం నుంచైనా 2 గంటల్లో హైదరాబాద్ చేరుకునేలా హై-స్పీడ్ కనెక్టివిటీని ఏర్పాటు చేయనున్నది. రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ద్వారా ప్రయాణాన్ని సులభతరం చేసి, పల్లెలకు, పట్నాలకు మధ్య దూరాన్ని తగ్గించనున్నది. హైదరాబాద్‌‌‌‌కు దక్షిణాన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని (నెట్ జీరో స్మార్ట్ సిటీ) నిర్మించనున్నది.  రాష్ట్రవ్యాప్తంగా 13 ‘భారత్ ఇండస్ట్రియల్ పార్కు’లను ఏర్పాటు చేసి, జిల్లాల్లో పరిశ్రమలను స్థాపించనున్నది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్‌‌‌‌లాంటి  టైర్-2 నగరాలను ‘రీజినల్ అర్బన్ క్లస్టర్స్’గా అభివృద్ధి చేసి, అక్కడే ఐటీ, విద్యా, వైద్య సౌకర్యాలను కల్పించనున్నది.  

స్కిల్ పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్.. 
రాష్ట్రంలోని ప్రతి యువకుడికి నాణ్యమైన శిక్షణ అందేలా ‘గైడెడ్ గ్రోత్’ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నది. ఇందుకోసం ‘తెలంగాణ స్టేట్ స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్ మిషన్’ ను నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి, అన్ని రకాల శిక్షణా కార్యక్రమాలను ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నది. సింగపూర్, జర్మనీలాంటి  దేశాల తరహాలో ‘డ్యూయల్ అప్రెంటిస్‌‌‌‌షిప్’ విధానాన్ని ప్రవేశపెట్టనున్నది.  క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ‘స్పోర్ట్స్ పాలసీ 2025’ను తీసుకురానున్నది.  హైదరాబాద్‌‌‌‌లో ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని స్థాపించి, క్రీడలను ఒక కెరీర్‌‌‌‌గా ఎంచుకునేలా యువతకు భరోసా ఇవ్వనున్నది. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్‌‌‌‌లో పతకాలు సాధించడమే లక్ష్యంగా ఎలైట్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నది.  చదువులో వెనుకబడిన వారిని, లేదా మధ్యలో మానేసిన వారిని కూడా కలుపుకుపోయేలా ‘స్కిల్ పాస్‌‌‌‌పోర్ట్’, ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్’ ( విధానాన్ని అమలు చేయనున్నది.  ఐటీఐలు, పాలిటెక్నిక్‌‌‌‌లను ‘అడ్వాన్స్‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్లు’ (ఏటీసీ)గా మార్చి, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా సిలబస్‌‌‌‌ను మారుస్తున్నది. టాస్క్, టామ్‌‌‌‌కామ్‌‌‌‌లాంటి సంస్థల ద్వారా విదేశాల్లో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నది.