health alert: విటమిన్ D లోపం..కనిపించే లక్షణాలు.. దుష్పలితాలు.. నివారణ మార్గాలు

health alert: విటమిన్  D లోపం..కనిపించే లక్షణాలు.. దుష్పలితాలు.. నివారణ మార్గాలు

ఆరోగ్యంగా ఉంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది..ఆరోగ్యంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు..అని తరుచుగా వింటుంటాం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఉరుకులు, పరుగుల జీవితాన్ని అనుభవిస్తున్నవారు ఎందరో.. దీంతో  ఆరోగ్యంగా ఉండేందుకు సహకరించే విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, ఎంజైమ్​ లు వంటి వాటి లోపాలు, హెచ్చుతగ్గులు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వీటి లోపం తీవ్రమైతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి వీటి సమతుల్యత కాపాడుకోవడం చాలా ముఖ్యం. 

శరీరాన్ని చక్కగా ఆరోగ్యంగా ఉంచే వాటిలో ముఖ్యమైనవి విటమిన్లు.. వాటిలో చాలా కీలకమైనది డి విటమిన్. సూర్యరశ్మి విటమిన్ అని పిలువబడే విటమిన్ డి మన ఆరోగ్యానికి ప్రధాన రక్షకుడు. ఇది ముఖ్యంగా ఎముక ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.అటువంటి డి విటమిన్​ లోపిస్తే.. 

విటమిన్ డి బలమైన ఎముకలు ,దంతాలను నిర్మించేందుకు వాటి సంరక్షణకు అవసరమైన కాల్షియంను శరీరం గ్రహించడానికి విటమిన్ డి సాయపడుతుంది. తగినంత విటమిన్ డి లేకుంటే  ఎముకలు సన్నగా, పెళుసుగా లేదా వికృతంగా మారవచ్చు, పిల్లలలో రికెట్స్ లేదా పెద్దలలో ఆస్టియోపోరోసిస్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఎముక ఆరోగ్యంలో పాటు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు కూడా విటమిన్ డి దోహదపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపర్చడంలో, మెదడు పనితీరుకు మద్దతు ఇస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి విటమిన్​ డి లోపం రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. 

విటమిన్​ డి లోపం.. లక్షణాలు

విటమిన్ D లోపంవల్ల ఈ ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయని AIIMS, హార్వర్డ్ , స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల్లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి చెబుతున్నారు. 

  • విటమిన్​ డి లోపిస్తే తరచుగా అలసట
  • మానసిక ఆందోళన,తరచుగా ఇన్ఫెక్షన్లు 
  • వెన్ను,ఎముక నొప్పి
  • నెమ్మదిగా గాయం నయం
  • జుట్టు రాలడం
  • కండరాల నొప్పి
  • ఆందోళన ,నిరాశ
  • బరువు పెరుగుట

విటమిన్ డి లోపాన్ని అధిగమించడం ఎలా..? 

సూర్యరశ్మి తగిలినప్పుడు మన శరీరం విటమిన్​ డి ని ఉత్పత్తి చేస్తుంది. రోజు 10 నుంచి 30 నిమిషాలు మధ్యాహ్నం సూర్యరశ్మీలో చేతులు, కాళ్లు ఓపెన్ చేసి ఉంచడం వల్ల విటమిన్​ పుష్కలంగా లభిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. 

ఆహార వనరులు ఏవి.. 

సాల్మన్ చేపలు, గుడ్డు సొనలు, పుట్టగొడుగులు ,కొవ్వు చేపలలో విటమిన్ డి లభిస్తుందంటున్నారు డాక్టర్లు. సూర్యరశ్మి విటమిన్ డి కి ఉత్తమ వనరు అని, ఆహారం ద్వారా చాలా తక్కువ విటమిన్​డి లభిస్తుందని డాక్టులు చెబుతున్నారు. 

విటమిన్​ డి కోసం సప్లిమెంట్లు.. 

విటమిన్​ డి లోపాన్ని సప్లిమెంట్లు సమర్థవంతంగా పెంచుతాయంటున్నారు డాక్టర్లు. అయితే సప్లిమెంట్లు డాక్టర్ల సూచనతో మాత్రమే తీసుకోవాలి. అధికంగా విటమిన్ డి తీసుకుంటే మంచికంటే ఎక్కువ హాని చేస్తుందంటున్నారు. ఇది మూత్ర పిండాల సమస్యలకు దారితీస్తుందంటున్నారు. పెద్దలు ప్రతి రోజు 600 నుంచి 800 IU వరకు తీసుకుంటే మంచిది అని చెబుతున్నారు. 

బలమైన శరీరం, సమతుల్య రోగనిరోధక వ్యవస్థ ,ఆరోగ్యకరమైన మనస్సుకు విటమిన్ డి చాలా అవసరం. దానిని తగినంతగా పొందేలా చూసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే. ఇది ఉత్తమమైన మార్గం అంటున్నారు డాక్టర్లు.