తుగ్లక్ చర్యలను గవర్నర్ ఆపాలి : వివేక్, కోదండరామ్

తుగ్లక్ చర్యలను గవర్నర్ ఆపాలి : వివేక్, కోదండరామ్

ప్రజాస్వామిక తెలంగాణ వేదిక నేతృత్వంలో.. జి.వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. అఖిలపక్ష నేతలు రాష్ట్ర గవర్నర్ ను కలిశారు. సెక్రటేరియట్ భవనాలు, ఎర్రంమంజిల్ లోని హెరిటేజ్ భవనం కూల్చొద్దని వారు గవర్నర్ ను కోరారు. వివేక్ వెంకటస్వామి, కోదండరామ్, జానారెడ్డి, రేవంత్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి, డీకే అరుణ, చింతల రామచంద్రారెడ్డి, ఎల్ రమణ, చాడ వెంకటరెడ్డి, జువ్వాడి నర్సింగరావు, పీఓడబ్ల్యూ సంధ్య, పీఎల్ విశ్వేశ్వర్రావు, సి.రామచంద్రయ్య ఇతర నాయకుల బృందం గవర్నర్ ను కలిసింది.

వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. పబ్లిక్ మనీని ప్రభుత్వం మిస్ యూజ్ చేస్తోందిని అన్నారు. సెక్షన్ 8, 80 రీఆర్గనైజేషన్ యాక్ట ప్రకారం జీహెచ్ఎంసీ తరఫున కస్టోడియన్ అయిన గవర్నర్ అన్ని భవనాల భద్రతను పర్యవేక్షించాలని తాము కోరామని వివేక్ వెంకటస్వామి చెప్పారు.

గవర్నర్ రాష్ట్రానికి సీఈఓ లాంటివారనీ.. ట్రాఫిక్ సహా ఎటువంటి ఇబ్బందులు కలిగించని సెక్రటేరియట్ భవనాలను కూల్చడం ప్రజాస్వామిక పద్ధతి కాదని అన్నారు కోదండరామ్. “ఇప్పుడున్న సెక్రటేరియట్ 70, 80 ఏండ్లు నడుస్తుంది. ఇప్పటికే చాలా అప్పుల్లో ఉన్నాం. ఎమ్మెల్యేలకు జబ్బులు చేస్తే .. హాస్పిటళ్లకు ప్రభుత్వం బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు కానీ.. సెక్రటేరియట్ కూల్చేస్తారట. సెక్షన్ 8 కింద ఈ భవనాలను పరిరక్షించేందుకు గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరాం. ఆర్కియాలజీ శాఖ వారు హెరిటేజ్ భవనంగా గుర్తించిన తర్వాత.. వీటిని తీసెయ్యడానికి ప్రభుత్వానికి అధికారం లేదు. కస్టోడియన్ అయిన గవర్నర్ కే సర్వాధికారాలున్నాయని చెప్పాం. న్యాయం చేస్తారనే ఆశ ఉందని జానారెడ్డి… గవర్నర్ తో అన్నారు. గవర్నర్ న్యాయం చేస్తారనే విశ్వాసంతో ఉన్నాం.” అని కోదండరామ్ చెప్పారు.

హైకోర్టులో 17 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయనీ. .. అన్నింటిపై విచారణ పూర్తయ్యేవరకు సెక్రటేరియట్ ను కూల్చొద్దని హైకోర్టు సూచించిందని చెప్పారు  పీఎల్ విశ్వేశ్వర్ రావు.

రాజధానిని ఇష్టమొచ్చిన మార్చిన తుగ్లక్ ను ఆనాడు ఎవరూ ప్రశ్నించలేదని.. ఈనాడు భవనాలు కూలగొడతా.. కొత్తవి కడతా అంటూ అదే తుగ్లక్ లాగా ప్రవర్తిస్తున్న కేసీఆర్ ను జనం ప్రశ్నిస్తున్నారనీ.. గవర్నర్ వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు వివేక్ వెంకటస్వామి.