వైస్ ప్రెసిడెంట్ పదవికైనా ఓకే..

వైస్ ప్రెసిడెంట్ పదవికైనా ఓకే..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేయడానికి తాను రిపబ్లికన్  పార్టీ నుంచి నామినేషన్  గెలవకపోతే వైస్ ప్రెసిడెంట్  పదవికి పోటీ చేయడానికైనా సిద్ధమేనని ఇండియన్  అమెరికన్, పారిశ్రామికవేత్త వివేక్  రామస్వామి తెలిపారు. వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేయడానికి ప్రస్తుతం ఆయన రిపబ్లికన్  పార్టీ నుంచి రేసులో ఉన్నారు. అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం జరిగిన డిబేట్ లో రామస్వామి లీడ్ లో కొనసాగుతున్నారు. తనకు అధ్యక్ష పదవిపై తప్ప మరే ఇతర పదవిపైనా ఆసక్తి లేదని ఇంతకుముందు ఆయన పేర్కొన్నారు.

 ప్రెసిడెంట్ అయితే తాను మాత్రమే అమెరికాను మళ్లీ ఏకం చేస్తానని గతంలో పలుమార్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా మాజీ ప్రెసిడెంట్  డొనాల్డ్  ట్రంప్ పై ఉన్న కేసులను కొట్టివేసి ఆయనను క్షమిస్తానని పేర్కొన్నారు. తాజాగా అభ్యర్థిత్వం విషయంలో రామస్వామి వెనక్కి తగ్గారు. అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రిపబ్లికన్  పార్టీ తరపున మాజీ ప్రెసిడెంట్  డొనాల్డ్  ట్రంప్ కు మళ్లీ అవకాశం ఇస్తే తనకు సమ్మతమేనని ఆయన వెల్లడించారు. ట్రంప్ తో కలిసి జాయింట్  టికెట్ పై పోటీ చేస్తానని తెలిపారు. బ్రిటన్ కు చెందిన జీబీ న్యూస్  అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్  పదవి అయినా తనకు బాగుంటుందని, తన లాంటి వయసు వారికి ఆ పదవి సరిపోతుందని వివేక్ రామస్వామి వ్యాఖ్యానించారు.