కమీషన్లు, ఆస్తులు పెంచుకోవడంపైనే కేసీఆర్ దృష్టి

కమీషన్లు, ఆస్తులు పెంచుకోవడంపైనే కేసీఆర్ దృష్టి

కాళేశ్వరం, మిషన్ భగీరథ కోసం ఖర్చు చేసిన డబ్బులో సగం మొత్తాన్ని దళితులకు ఇచ్చినా వాళ్లు ఎంతో అభివృద్ధి చెందేవాళ్లని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. దళిత ఉప ముఖ్యమంత్రిని తొలగించిన సీఎం.. కనీసం ఎస్సీలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. శంషాబాద్ లో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన డప్పు మోత సభకు వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దళితుల విషయంలో కేసీఆర్ వైఖరిని తప్పుబట్టారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి కొట్లాడిన సమయంలో అధికారంలోకి వచ్చాక దళితులకు భూమి ఇస్తానని చెప్పారని అన్నారు. అయితే సీఎం అయ్యాక దళితులకు మూడెకరాలు ఇచ్చే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకుండా పోయిందని మండిపడ్డారు. దళితుల్లో చాలా మంది కౌలు రైతులు ఉన్నారని, వారికి కూడా రైతు బంధు ఇవ్వాలని కేసీఆర్ తో ఎన్నో సార్లు కొట్లాడానని అన్నారు. అయినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ కమిషన్లు నొక్కిన ఘనత కేసీఆర్ దని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కాళేశ్వరం నుంచి మూడేళ్లలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలను మభ్యపెడుతున్న సీఎం కేసీఆర్ కు దళితులు బుద్ధి చెప్పాలని వివేక్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చాలా మంది దళితులు ఇంకా అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కొవిడ్ సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ఉచిత బియ్యం, గ్యాస్ అందిస్తే.. కేసీఆర్ మాత్రం ఆర్టీసీ బస్సు ఛార్జీలను విపరీతంగా పెంచారని అన్నారు. మద్యం అమ్మకాల్లో తెలంగాణ ముందంజలో ఉందని విమర్శించారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఇప్పటి వరకు 110 అంబేద్కర్ విగ్రహాలు పెట్టించానన్న వివేక్.. తన నియోజకవర్గంలో డప్పు కళాకారులందరికీ డప్పులు అందిస్తామని హామీ ఇచ్చారు.