సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించారు

సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించారు

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీని విస్మరించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు అవుతున్నా సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం దురదృష్టకరమన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజలు ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించుకున్నారని తెలిపారు. అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం సర్కార్ మెడలు వంచి తెలంగాణను భారత్ లో విలీనం చేశారని చెప్పారు. 

విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించారని వివేక్ వెంకట స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను గుర్తించి తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహించడం గొప్ప శుభ పరిణామం అన్నారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ పోరాటం చేసినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్నిసికింద్రాబాద్ పరేడ్ డ్రౌండ్ లో కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం హర్షనీయమన్నారు. విమోచన దినోత్సవంతో తెలంగాణ ప్రజలను ఒక్క తాటికిపైకి  తీసుకొచ్చే ప్రయత్నం చేశారని తెలిపారు.