బండి సంజయ్‌‌‌‌పై దాడి.. కేసీఆర్‌‌‌‌ కుట్రలో భాగమే

బండి సంజయ్‌‌‌‌పై దాడి.. కేసీఆర్‌‌‌‌ కుట్రలో భాగమే
  • ఆ ప్రాజెక్టు‌‌ పేరుతో రూ.లక్ష కోట్లు దుర్వినియోగం.. సీఎం కేసీఆర్​పై వివేక్‌‌‌‌ మండిపాటు
  •     కాళేశ్వరం బ్యాక్‌‌‌‌ వాటర్‌‌‌‌తో వేల ఎకరాలు మునక
  •     దాని వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకునేటోళ్లే లేరు
  •     బండి సంజయ్‌‌‌‌పై దాడి.. కేసీఆర్‌‌‌‌ కుట్రలో భాగమే
  •     పోలీసులను వాడుకుని అరాచక పాలన సాగిస్తున్నాడని ఫైర్

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/కాటారం, వెలుగు: ‘‘ఫామ్​హౌస్​ కోసమే సీఎం కేసీఆర్‌‌‌‌ కాళేశ్వరం కట్టిండు. ఈ ప్రాజెక్టు‌‌ వల్ల రూ.లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. కాళేశ్వరం బ్యాక్‌‌‌‌ వాటర్‌‌‌‌తో భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో వేల ఎకరాల పంట భూములు నీట మునిగి రైతులకు నష్టం జరుగుతోంది. వారిని ఆదుకునేటోళ్లే లేరు”అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి అన్నారు. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌‌‌‌పై దాడి కేసీఆర్‌‌‌‌ కుట్రలో భాగమేనని ఆరోపించారు. దేశంలో తానే నంబర్‌‌‌‌వన్‌‌‌‌ సీఎం అని కేసీఆర్‌‌‌‌ గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ ఆయన అవినీతిలో నంబర్‌‌‌‌వన్‌‌‌‌ సీఎం అని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. మంగళవారం జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కాటారంలో వివేక్​ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రెస్‌‌‌‌ మీట్​లో మాట్లాడారు.

ముంపుతో కాళేశ్వరం అవినీతి బయటపడ్డది

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేసీఆర్‌‌‌‌ ఇచ్చిన స్పీచ్‌‌‌‌లో కాళేశ్వరం ఊసే లేకపోవడం ఆ ప్రాజెక్టు‌‌ అధోగతికి నిదర్శనమని వివేక్​​ అన్నారు. మేడిగడ్డ, అన్నారం పంప్‌‌‌‌హౌస్‌‌లు నీట మునగడంతో కాళేశ్వరం అవినీతి గురించి దేశం మొత్తానికి నిజాలు తెలిశాయన్నారు. ఇంజనీరింగ్‌‌‌‌ నిపుణులను సంప్రదించకుండా సొంత నిర్ణయం తీసుకుని కాళేశ్వరం రాంగ్ డిజైన్ చేసిన కేసీఆర్‌‌‌‌ను ఉరితీసినా పాపం లేదన్నారు. మందు, డబ్బు పంచి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ శ్రేణులను కాళేశ్వరం పర్యటనకు పంపి అద్భుతమని ప్రకటించుకోవడం, డబ్బులిచ్చి చానెళ్లలో స్టోరీలు ప్రసారం చేయించుకోవడం కేసీఆర్‌‌‌‌ కే చెల్లిందని అన్నారు. 

రాష్ట్రంలో నియంత పాలన

దేశంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ తెలంగాణలో నియంత పాలన సాగుతున్నదని, దానికి నిదర్శనమే పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ పై దాడి అని వివేక్​ అన్నారు. కేసీఆర్‌‌‌‌ కుట్రలో భాగంగానే సంజయ్‌‌‌‌పై టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులు, కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థను వాడుకుని కేసీఆర్‌‌‌‌ అరాచకాలకు పాల్పడుతున్నారని, ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడుతున్న తీరును చూస్తే రాష్ట్రానికి ఇంకా స్వాతంత్ర్య రాలేదా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. కేసీఆర్​ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా తమ ఓటుతో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

అవినీతి సొమ్ముతో గెలిచే ప్రయత్నాలు

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి 16 లక్షల ఇండ్లు మంజూరు కాగా ఒక్క ఇంటినీ నిర్మించకుండా కేంద్రం ఇచ్చిన సొమ్మును కేసీఆర్​ దోచుకున్నాడని వివేక్​ ఆరోపించారు. మిషన్‌‌‌‌ భగీరథ, మిషన్‌‌‌‌ కాకతీయ వంటి పథకాలతో కేసీఆర్‌‌‌‌ కుటుంబం వేల కోట్లు దండుకుంటోందని, ఆ అవినీతి సొమ్ముతో రాబోయే ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచి గెలవాలని ప్రయత్నిస్తోందని చెప్పారు.  కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చందుపట్ల కీర్తిరెడ్డి, సునీల్ రెడ్డి, బీజేపీ కాటారం మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

కమీషన్ల పేరుతో రూ.30 వేల కోట్లు కాజేశారు

రాష్ట్రంలో కొత్తగా ఒక్క ఎకరానికీ నీళ్లివ్వని కాళేశ్వరంపై రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి కమీషన్ల పేరుతో రూ.30 వేల కోట్లకుపైగా కేసీఆర్‌‌‌‌ కాజేశారని వివేక్​ ఆరోపించారు. రూ.30 వేల కోట్లతో కట్టగలిగే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు‌‌ను రూ.1.20 లక్ష కోట్లకు పెంచి కాళేశ్వరంగా పేరు మార్చి కమీషన్లు దండుకున్నాడని విమర్శించారు. మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు ఇదివరకే ఉండగా కాళేశ్వరం పేరు చెప్పి లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్‌‌‌‌ వాటర్‌‌‌‌తో భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో వేల ఎకరాల పంట భూములు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌‌‌‌ చేశారు.