కాంగ్రెస్​ హయాంలో రూపాయిలో 15 పైసలే అందేవి: వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్​ హయాంలో రూపాయిలో 15 పైసలే అందేవి: వివేక్ వెంకటస్వామి
  • కాంగ్రెస్​ హయాంలో రూపాయిలో 15 పైసలే అందేవి
  • దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నరు
  • పార్లమెంట్‌‌‌‌ ప్రవాసీ యోజనలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల
  •  రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేద్దాం: వివేక్‌‌ వెంకటస్వామి

గోదావరిఖని/మహాదేవ పూర్,  వెలుగు: ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని నరేంద్రమోడీ పారదర్శకపాలన సాగిస్తున్నారని కేంద్ర మత్స్య, పాడిపరిశ్రమల శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. అభివృద్ధికి బీజేపీ బాటలు వేస్తున్నదని, పార్టీని ఆదరించాలని కోరారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన పార్లమెంట్‌‌‌‌ ప్రవాసీ యోజన కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌‌‌‌ వెంకటస్వామితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 40 ఏండ్లు అవినీతి, అక్రమాల పాలన సాగిందని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని చెప్పారు. గతంలో కేంద్రం నుంచి విడుదలయ్యే ప్రతి రూపాయిలో  15 పైసలు మాత్రమే ప్రజలకు చేరేవని, అప్పటి ప్రధాని రాజీవ్‌‌‌‌ గాంధీనే ఈ విషయం చెప్పారని అన్నారు. ఇప్పుడు మోడీ హయాంలో ప్రతి రూపాయీ ప్రజలకు చేరుతున్నదని, ఇటీవల ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లాలో ఓ సర్పంచ్‌‌‌‌ తమకు  కేంద్రం నుంచి రూ. కోటి నిధులు వచ్చాయని చెప్పినప్పుడు ఆనందం కలిగిందని రూపాల పేర్కొన్నారు. నానో యూరియా తయారీలో దేశం ముందున్నదని,  25 కిలోల యూరియాకు  బదులు 500 మిల్లీలీటర్ల నానో యూరియా లిక్విడ్‌‌‌‌ను  స్ప్రే చేస్తే సరిపోతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నదని, 10 కోట్ల మంది రైతులకు పంట సాయం అందించి ఆదుకుంటున్నదని వివరించారు.

కరోనా వ్యాక్సిన్‌‌‌‌ను మనం 70 దేశాలకు పంపిణీ చేశామని చెప్పారు. మేకిన్ ఇండియాతో విజయాలు సాధించామని అన్నారు. కాంగ్రెస్‌‌‌‌ పాలనలో సీఎం పదవిని పంచుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు.  రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు అన్ని స్థాయిల లీడర్లు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ 11వ వార్డు శక్తి కేంద్రం ఇన్​చార్జి  వడ్డెపల్లి భారతి ఇంట్లో కేంద్ర మంత్రి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌‌‌‌ కుమార్‌‌‌‌, సీనియర్​ నేత సోమారపు సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్‌‌‌‌, పెద్దపల్లి పార్లమెంట్‌‌‌‌ కన్వీనర్‌‌‌‌ పి.మల్లికార్జున్‌‌‌‌, అసెంబ్లీ కన్వీనర్‌‌‌‌ పిడుగు కృష్ణ, వడ్డేపల్లి రాంచందర్‌‌‌‌, సోమారపు లావణ్య, బల్మూరి వనిత, భిక్షపతి  తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఇండియన్ మెడికల్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఆధ్వర్యంలో డాక్టర్‌‌‌‌ క్యాస్‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌ ఇంట్లో  జరిగిన మీటింగ్‌‌‌‌లో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడారు.  ఈ మీటింగ్‌‌‌‌లో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌‌‌‌ అనిల్‌‌‌‌ కుమార్‌‌‌‌, డాక్టర్లు  పాల్గొన్నారు.

కాళేశ్వరం ఆలయంలో పూజలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ముక్తేశ్వరస్వామి ఆలయాన్ని కేంద్ర మంత్రి  పురుషోత్తం రూపాల , బీజేపీ  జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెంపుల్ తూర్పు రాజ గోపురం వద్ద కేంద్ర మంత్రికి మహాదేవ పూర్ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు  గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి వెంట బీజేపీ లీడర్లు  కన్నం యుగంధర్, చందుపట్ల కీర్తి రెడ్డి ,  సిరిపురం శ్రీమన్నారాయణ ,  రామకృష్ణ , బొల్లం కిషన్ తదితరులు ఉన్నారు. కాగా, కాళేశ్వరం ఆలయ దర్శనానికి వచ్చిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలకు కాళేశ్వరం గంగపుత్రులు  వినతిపత్రం ఇచ్చారు. 120  బెస్త కుటుంబాలకు బోట్లు, ఎలక్ట్రిక్ బైక్ లు, ఫిషింగ్ కు కావలసిన సామగ్రిని అందించాలని కోరారు.  

తెలంగాణ సొమ్మును కేసీఆర్​ ఫ్యామిలీ దోచుకుంటున్నది: వివేక్‌‌

రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తున్నదని, దాన్ని అంతం చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు,  మాజీ ఎంపీ  వివేక్‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ప్రవాసీ  యోజన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు 10 కిలోల చొప్పున రేషన్‌‌‌‌ బియ్యం, మహిళల బ్యాంకు ఖాతాలలో 24 నెలల పాటు రూ. 500, గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తున్న ఘనత ప్రధాని నరేంద్ర మోడీదేనని చెప్పారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్‌‌‌‌తో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన వద్దని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అవినీతి అక్రమాలతో తెలంగాణ సొమ్మును కేసీఆర్‌‌‌‌ కుటుంబం దోచుకుంటున్నదని, వారిని గద్దె దింపేందుకు బీజేపీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతకుముందు ఎన్టీపీసీ గెస్ట్‌‌‌‌హౌస్‌‌‌‌లో కేంద్ర మంత్రి పురుషోత్తమ్​ రూపాలకు  వివేక్‌‌‌‌ వెంకటస్వామి శాలువా కప్పి సత్కరించారు. అన్నపూర్ణ కాలనీలోని హిందూవాహిని నాయకుడు మిట్టపల్లి సతీశ్‌‌‌‌ ఇంట్లో బ్రేక్‌‌‌‌ పాస్ట్‌‌‌‌ చేసి 49వ బూత్‌‌‌‌ కమిటీ ప్రెసిడెంట్‌‌‌‌ శ్రీకాంత్‌‌‌‌ ఇంట్లో బూత్‌‌‌‌ లెవల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో పాల్గొన్నారు.