రాష్ట్రంలో కాంగ్రెస్ 15 ఎంపీ సీట్లు గెలుస్తది

రాష్ట్రంలో కాంగ్రెస్ 15 ఎంపీ సీట్లు గెలుస్తది
  • నిజామాబాద్​ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి ప్రకటన హర్షణీయం: వివేక్‌‌‌‌
  • కాంగ్రెస్‌‌‌‌ పాలనలోనే రాష్ట్రంలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు వచ్చాయని వెల్లడి
  • కాకా ఫ్యామిలీ సేవలకు గుర్తింపుగానే వంశీకృష్ణకి పెద్దపల్లి టికెట్: జీవన్ రెడ్డి 

జగిత్యాల, వెలుగు: నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని ప్రకటించడం హర్షణీయమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ రావడంతో జగిత్యాలలోని ఆయన నివాసానికి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అక్కడే మీడియాతో వివేక్ మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం పెంచి, ఆ మొత్తాన్ని ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాంట్రాక్టర్ల నుంచి వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. ఈడీతో కేసులు పెట్టి, ఈ బాండ్లపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ సర్కారు చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేసిందని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి ఫోన్ ట్యాపింగ్ ఎక్విమెంట్ తెప్పించిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరారు. ఒకప్పుడు అక్రమ అరెస్టులతో అట్టుడికిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాస్వామిక పాలనతో స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు వచ్చాయన్నారు. ప్రజల సమస్యలను నేరుగా ప్రజా ప్రతినిధులకు చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు ఉందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే లాభపడిందని, లిక్కర్ స్కామ్ ద్వారా ఎమ్మెల్సీ కవిత రూ.వేల కోట్లు లబ్ధి పొందారని ఆరోపించారు. 

వివేక్ వెంకటస్వామికి కాకా బ్రాండ్: జీవన్ రెడ్డి

వివేక్ వెంకట్‌‌‌‌స్వామికి కాకా అనే బ్రాండ్ ఉందని, ఆయన ఆశీర్వాదంతోనే వివేక్ ముందుకెళ్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆశయ సాధనే జీవిత లక్ష్యంగా కాకా పనిచేశారని గుర్తుచేశారు. వివేక్ కుటుంబం అందించిన సేవలను హైకమాండ్ గుర్తించడం వల్లే యువ నాయకుడు వంశీకి పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కిందన్నారు. కేసీఆర్ స్వార్థ ప్రయోజనాల కోసం రూ.40 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో అంతకు మూడు రెట్లు ఖర్చుపెట్టి కాళేశ్వరం కట్టారన్నారు. కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేవలం మూడు నెలల్లోనే అమలు చేసి చూపిందన్నారు. పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ యువత కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు. పాకిస్థాన్‌‌‌‌ను బూచిగా చూపుతూ బీజేపీ రాజకీయ లబ్ధి పొందుతోందని, కానీ పాకిస్థాన్ మెడలు వంచింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని, ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్ష లాంటివని, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌‌‌‌తోనే పేదలకు మేలు: గడ్డం వంశీకృష్ణ

దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు మేలు జరుగుతుందని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు, దేశానికి ఏమి చేసిందో ప్రతి ఇంట్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తన తాత కాకా వెంకటస్వామి పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారని, ఆయన హయాంలోనే పేదలకు రేషన్ బియ్యం, కార్మికులకు పెన్షన్​ స్కీం వచ్చాయని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ కాకా కీలక పాత్ర పోషించారని, ఆయన స్పూర్తితోనే తాను ప్రజా సేవకు సిద్ధమయ్యానన్నారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అక్రమ దందాలు, కబ్జాలు పెరిగాయని, గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడిన యువత భవిష్యత్ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలో అధ్వానంగా మారిందని, కాంగ్రెస్ వస్తేనే న్యాయం జరుగుతుందనే నమ్మకంతో అండగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ప్రాంతంలో 45 వేల ఉద్యోగాలు తీసుకొస్తామని వంశీకృష్ణ హామీ ఇచ్చారు.