రాబోయే రోజుల్లో కేసీఆర్ పతనం తప్పదు

రాబోయే రోజుల్లో కేసీఆర్ పతనం తప్పదు

పోడు రైతులను ప్రభుత్వం ఎందుకు వేధిస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. వారికి పట్టాలివ్వాలని డిమాండ్ చేశారాయన. ఆదివాసీల విషయంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కుర్చీ వేసుకుని పోడు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో ప్రతిపక్షాల గొంతు నొక్కినట్లుగానే ఇప్పుడు గిరిజనులకు అండగా నిలుస్తున్న మీడియా గొంతు నొక్కుతున్నారని, రాబోయే రోజుల్లో కేసీఆర్ పతనం తప్పదని తెలిపారు. పోడు భూముల పేరిట అక్రమ కేసులు పెట్టి ఆదివాసీలను జైల్లో పెడుతున్నారని, హైదరాబాద్ లో ఒక మంత్రి హోటల్ పెట్టడానికి చెట్లను నరికేస్తే నోరు మెదపని సీఎం పోడు భూముల్లో చెట్లను నరికిన గిరిజన మహిళలను జైళ్ళల్లో నిర్భందించడం దారుణమన్నారు. మాయమాటలతో కేసీఆర్ తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నాడన్నారు. ఎంతో నమ్మకంతో గెలిపిస్తే...తెలంగాణా ప్రజలను అన్ని విషయాల్లో మోసం చేస్తున్నారని విమర్శించారు. 

తెలంగాణ ఏర్పాటు తర్వాత పోడు భూముల సమస్యపై సీరియస్ గా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి.. తానే నేరుగా క్షేత్ర స్థాయికి వెళ్లి కుర్చీ వేసుకొని మరీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే 2021 డిసెంబర్ లో ఓ అత్యున్నత స్థాయి కమిటీ వేసి సమగ్ర సర్వే ద్వారా పోడు భూములను గుర్తించి, వాటి హక్కు దారులందరికీ పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లోని అడవుల్లో పోడు రైతులు, ఫారెస్ట్​ ఆఫీసర్ల మధ్య తరచూ యుద్ధ వాతావరణం నెలకొంటోంది. 2006లో భారత ప్రభుత్వం అటవీ విధానాలను సవరిస్తూ.. అటవీ భూములలో 2005వ సంవత్సరం వరకు సేద్యం చేస్తున్న గిరిజన పేదలకు ఒక కుటుంబానికి 10 ఎకరాల భూములపై సేద్యపు హక్కులు(యాజమాన్యపు హక్కులు కాదు) ఇవ్వాలని ప్రతిపాదించింది. అదే గిరిజనేతరులైతే కనీసం 75 సంవత్సరాలకు తగ్గకుండా సదరు అటవీ భూముల్లో సేద్యం చేస్తుంటే వారికి ఆ భూములపై సేద్యపు హక్కులను ఇవ్వడానికి అంగీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.