
బాబు అంత్యక్రియల్లో పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ జేఏసీ నేతలు, అఖిలపక్షం నేతలు… ఆరెపల్లి నుంచి కరీంనగర్ బస్ డిపోకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎంపీ బండి సంజయ్, మంద కృష్ణ మాదిగ, వివేక్ వెంకటస్వామి, జిల్లా జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఆ తరువాత కోర్ట్ సర్కిల్ దగ్గర రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు బీజేపీ, జేఏసీ నేతలు. అంతిమ యాత్ర సందర్భంగా పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండించారు నేతలు. ఇంతటి దౌర్బాగ్యం ఎక్కడా చూడలేదన్నారు సంజయ్. విధ్వంసం ఎక్కడ జరిగిందో చూపించాలన్నారు. ఎంపీనైన తన గల్లా పట్టుకుని పోలీసులు దౌర్జన్యం చేశారని మండిపడ్డారు.
కేసీఆర్ ది నియంతృత్వ పాలన అన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. పోలీసుల్ని సీఎం వాడుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని.. ఆయన పాలనకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. సంజయ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామన్నారు వివేక్.
రెండుగంటల పాటు కోర్ట్ సర్కిల్ దగ్గర ఆందోళన తర్వాత.. జేఏసీ నాయకులు, బీజేపీ నేతలు సీపీ ఆఫీసుకు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. ఎంపీ షర్ట్ పట్టుకున్నందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ర్యాలీ జరుపుకోండని ఇచ్చిన హామీని కూడా పోలీసులు నెరవేర్చలేదన్నారు. అందుకు బాబు కుటుంబ సభ్యులకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.
ఆందోళన చేస్తున్న ఎంపీ బండి సంజయ్ కు ఫోన్ చేసి పరామర్శించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. పోలీసుల దాడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రామగుండం సీపీ సత్యనారాయణ.. ధర్నా దగ్గరకు వచ్చారు. ఫోటోలు పరిశీలించి బండి సంజయ్ తో చర్చలు జరిపారు. దాడి నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీపీ.
అటు కరీంనగర్ లోని SRR కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు. జగిత్యాల-కరీంనగర్ హైవేపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. సీఎం కేసీఆర్ పై హత్యాయత్నం కేసు పెట్టాలన్నారు. హైకోర్ట్ తిట్టినా ప్రభుత్వంలో చలనం లేదని.. సమ్మెను అణచేందుకు కుట్ర చేస్తున్నారన్నారు జీవన్ రెడ్డి.
మాధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కరీంనగర్ లో టెన్షన్ వాతావరణం కనిపించింది. ఇక రేపు కాంగ్రెస్ నేతలు కరీంనగర్ కు వెళ్లాలని నిర్ణయించారు. స్వయంగా వెళ్లి కార్మికులకు మద్దతు తెలుపుతామన్నారు భట్టి విక్రమార్క.