రాష్ట్రపతి ముర్ముతో వివేక్ వెంకటస్వామి భేటీ 

రాష్ట్రపతి ముర్ముతో వివేక్ వెంకటస్వామి  భేటీ 
  •     ‘కాకా అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్​స్టిట్యూషన్స్’ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ఆహ్వానం 
  •     హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ప్రోగ్రామ్​కూ రావాలని విజ్ఞప్తి 

న్యూఢిల్లీ, వెలుగు : డిసెంబర్ లో నిర్వహించనున్న ‘కాకా అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్​స్టిట్యూషన్స్’ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి కోరారు. మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ముర్మును కలిసి ఆహ్వానం అందజేశారు. ఈ సమావేశంలో బీజేపీ కేంద్ర, రాష్ట్ర వ్యవహారాల సమన్వయకర్త నూనె బాల్ రాజ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్  మేనేజింగ్​ కమిటీ ప్రెసిడెంట్​, పూర్వ విద్యార్థి గుస్తి నూరియా పాల్గొన్నారు. 

దాదాపు అరగంట పాటు సాగిన సమావేశంలో అంబేద్కర్ విద్యాసంస్థల ఏర్పాటు, సాధించిన విజయాలను రాష్ట్రపతికి వివేక్ వివరించారు. అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ లో నిర్వహించనున్న ‘కాకా అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్’ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా రాష్ట్రపతిని ఆహ్వానించినట్టు చెప్పారు. ‘‘పేద విద్యార్థులకు క్యాపిటేషన్ ఫీజ్ లేకుండా కార్పొరేట్ కు దీటుగా మంచి విద్య అందాలన్నదే కాకా వెంకటస్వామి కల. దానికి తగ్గట్టుగానే 1973 డిసెంబర్ 12న అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ ను స్థాపించారు. ఈ విద్యాసంస్థలను స్థాపించి 50 ఏండ్లు అవుతోంది.

కాకా ఆశయ సాధన దిశగా విద్యాసంస్థలు పయనిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మంచి మెరిట్ లో పాస్ కావడమే కాకుండా, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. రెండేండ్ల కింద స్టేట్ ఇంటర్ బోర్డు పరీక్షల్లో 2,3, 7,8 ర్యాంకులు మా విద్యార్థులకే దక్కాయి. అలాగే ఎల్ఎల్ఎమ్ ఎగ్జామ్ లో ఫస్ట్ ప్లేస్ సాధించారు” అని తెలిపారు. పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందాలన్న కాకా ఆశయం.. అంబేద్కర్ విద్యాసంస్థలతో నెరవేరుతోందన్నారు. తమ విద్యాసంస్థలు సాధించిన విజయాలు అడిగి తెలుసుకుని రాష్ట్రపతి 
అభినందించారని వివేక్​ పేర్కొన్నారు. 

హెచ్ పీఎస్ వేడుకలకూ ఆహ్వానం.. 

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరుకావాలని రాష్ట్రపతిని కోరినట్టు నూనె బాల్ రాజ్ తెలిపారు. 1923లో స్థాపించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఈ ఏడాది వందేండ్లు పూర్తి చేసుకుంటుందని చెప్పారు. డిసెంబర్ లో శతాబ్ది వేడుకలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.  తమ ఆహ్వానాలపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. హెచ్ పీఎస్ చరిత్రను రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారని, ఇక్కడ చదువుకుని ఉన్నత పదవుల్లో ఉన్న పది మంది పేర్లను రాష్ట్రపతికి చెప్పామన్నారు. దేశంలోని ఉత్తమ విద్యాసంస్థల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటని గుస్తి నూరియా అన్నారు.