పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడు?

పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడు?
  • రాష్ట్రానికి నష్టం చేస్తున్నప్రాజెక్టులపై మౌనం ఎందుకు?
  • జగన్ తో ఫ్రెండ్ షిప్ కోసంజనాలను బలిచేస్తున్నడు
  • ఇద్దరు సీఎంలకు మధ్యవర్తిగా మేఘా కృష్ణారెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసే పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. ప్రాజెక్టుల్లో కమీషన్లు, జగన్​తో ఫ్రెండ్​షిప్​  కోసం జనాలను బలిచేస్తున్నాడని ఫైరయ్యారు. ఇద్దరు సీఎంలు ఒక్కటేనని, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మంగళవారం రిలీజ్  చేసిన ప్రకటన లో విమర్శించారు. కేసీఆర్‌‌, జగన్‌‌ ల మధ్య కమీషన్ల  వ్యవహారంలో మేఘా కృష్ణారెడ్డి  మీడియేటర్​గా  పనిచేస్తున్నారన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఏపీలో మేఘా కంపెనీ ప్రాజెక్టులు కడుతోందని, ఆ కంపెనీకి రాష్ట్రంలో ఇచ్చిన ప్రాజెక్టులను క్యాన్సిల్​ చేయాలని డిమాండ్​ చేశారు. ప్రాణహిత– చేవెళ్లలో సరిగా పనులు చేయకుండానే12 వేల కోట్ల బిల్లులు తీసుకున్న మేఘా కంపెనీకి మళ్లీ లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం అప్పగించారన్నారు. ఏపీలో ఎన్నికలకు కేసీఆర్​ డబ్బులు పంపాడని, గెలిచాక ఇంటికి పిలిపించుకున్నాడన్నారు. ఇద్దరి మధ్య స్నేహం కారణంగానే ఏపీ ప్రాజెక్టులపై సీఎం ఏమీ మాట్లాడలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క కల్వకుంట్ల ఫ్యామిలీనే బాగుపడుతోందని, కమీషన్లు దండుకుని ఫామ్​హౌస్​లు కట్టుకుంటోందని వివేక్​ మండిపడ్డారు.