తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజన్​ సర్కారే: వివేక్ వెంకటస్వామి

తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజన్​ సర్కారే: వివేక్ వెంకటస్వామి
  • బీఆర్ఎస్ సర్కార్ పై ప్రజలకు నమ్మకం పోయింది: వివేక్ వెంకటస్వామి
  • సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు
  • మేం అధికారంలోకి వస్తే కార్మికుల ఇన్ కమ్ ట్యాక్స్ సంస్థ నుంచే చెల్లిస్తం
  • కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియా తరహాలో జీతాలిస్తామని హామీ
  • మంచిర్యాలలో ఇంటింటికి పాదయాత్ర 

మంచిర్యాల/బెల్లంపల్లి: బీఆర్ఎస్ ​ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని, ఈసారి తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారేనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఆ పార్టీ ఎలక్షన్​ మేనిఫెస్టో కమిటీ చైర్మన్​ వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఆదివారం ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావుతో కలిసి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గొల్లవాడ, అంబేద్కర్​నగర్, సుభాష్ నగర్ లో ఇంటింటికి పాదయాత్ర చేశారు. కాలేజీ రోడ్​లో సింగరేణి కార్మికులతో సమావేశం నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణం పోస్ట్ ఆఫీస్ బస్తీలో బీజేపీ ఆఫీస్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలనలో భారత్ కు ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు. పేదల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్​ అవినీతి, నియంతృత్వ పాలనతో విసిగిపోయిన ప్రజలు.. రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలని బలంగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు.  

సింగరేణి ప్రైవేటీకరణపైబీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. 

కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరిస్తుందని బీఆర్ఎస్​ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివేక్​ ఫైర్​అయ్యారు. ‘‘సింగరేణిలో కేంద్ర, రాష్ట్రాల వాటా 49:51గా ఉంది. బోర్డు డైరెక్టర్లు కేంద్రం నుంచి ఇద్దరు ఉంటే, రాష్ర్టం నుంచి ఐదుగురు ఉన్నారు. రాష్ట్రానికంటే తక్కువ వాటా ఉన్న కేంద్రం సింగరేణి ఎలా ప్రైవేటీకరిస్తుంది” అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ రామగుండం పర్యటనకు వచ్చినప్పుడు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చినప్పటికీ, బీఆర్ఎస్​లీడర్లు బీజేపీపై దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే సింగరేణి సంస్థను మరింత అభివృద్ధి చేస్తాం. సింగరేణి కార్మికుల నుంచి వసూలు చేసే ఇన్​కమ్​ ట్యాక్స్​ను ఆ సంస్థనే చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియాలో ఇస్తున్న వేతనాలను చెల్లిస్తాం. సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులకు ఇండ్ల స్థలాలు కూడా పంపిణీ చేస్తాం” అని హామీ ఇచ్చారు. ఈ అంశాలను బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతామని చెప్పారు.

జర్నలిస్టులకు బాల్క సుమన్ క్షమాపణలు చెప్పాలి..  

జర్నలిస్టులపై చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వివేక్ చెప్పారు.​ బాల్క సుమన్ వెంటనే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఎమ్మెల్యే బాల్క సుమన్ జర్నలిస్టులను వాడు, వీడు అంటూ దూషించడం సిగ్గుచేటు. ప్రజల సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై నిష్పక్షపాతంగా వార్తలు రాస్తున్న జర్నలిస్టులపైకి తన అనుచరుల ను రెచ్చగొట్టడం కరెక్టు కాదు. ఈ ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో, ఫ్రస్ట్రేషన్​తో బాల్క సుమన్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు” అని వివేక్​ ఫైర్ అయ్యారు. 

బీజేపీలో చేరికలు.. 

కాసిపేట మండలం కుర్రేగఢ్, లక్ష్మీపూర్, సోనాపూర్ గ్రామాలకు చెందిన వంద మందికి పైగా యువకులు బెల్లంపల్లిలో వివేక్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంచిర్యాలోని బీజేపీ జిల్లా ఆఫీసులో చెన్నూర్​ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో వివేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు.