ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మందమర్రి,వెలుగు: మందమర్రి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు కత్తెర్ల శ్యామ్, కత్తెర్ల శ్రీకాంత్​ను బుధవారం  పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్​వెంకటస్వామి పరామర్శించారు. అనంతరం అదే గ్రామంలో అనారోగ్యంతో మృతిచెందిన మరో కార్యకర్త  కత్తెర్ల సంతోష్​ కుటుంబంతో మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, మందమర్రి, రామకృష్ణాపూర్​ టౌన్  ప్రెసిడెంట్లు సప్పిడి నరేశ్, మహంకాళీ శ్రీనివాస్, నియోజకవర్గ కన్వీనర్ అక్కల రమేశ్, మందమర్రి టౌన్​జనరల్ సెక్రటరీలు అల్లంల నగేశ్, గడ్డం శ్రీనివాస్, బీజేవైఎం ప్రెసిడెంట్​ఓరుగంటి సురేందర్, శేఖర్, జనరల్ సెక్రటరీ అభిలాశ్, శశికుమార్, అల్లంల పూర్ణచందర్, ప్రవీణ్​ పాల్గొన్నారు.

గనుల్లో ప్రమాదాలు లేకుండా చర్యలు

మందమర్రి/నస్పూర్,వెలుగు: బొగ్గు గనుల్లో ఎంప్లాయీస్​ సేఫ్టీకి ప్రయారిటీ ఇవ్వాలని, రక్షణ సూత్రాలు పాటిస్తూ డ్యూటీ చేస్తే  ప్రమాదాలను జరగవని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్ చెప్పారు. బుధవారం స్థానిక జీఎం ఆఫీస్​ కాన్ఫరెన్స్​ హాల్​లో ఏరియాలోని బొగ్గు గనులు, ఓసీపీల సేఫ్టీ ఆఫీసర్లు, ప్రాజెక్టు ఆఫీసర్లతో నిర్వహించిన సేఫ్టీ రివ్యూలో ఆయన మాట్లాడారు. రక్షణతో కూడిన  బొగ్గు ఉత్పత్తికి ఎంప్లాయిస్​, ఆఫీసర్లు సమన్వయంతో కృషి చేయాలన్నారు. సమావేశంలో ఏరియా ఏరియా ఎస్​వోటు జీఎం సీహెచ్​కృష్ణారావు, ఏజీఎం రాంమూర్తి, కేకే ఓసీపీ పీవో రమేశ్, ఏరియాసేఫ్టీ ఆఫీసర్​ ఓదెలు, కేకే గ్రూప్, కాసిపేట గ్రూప్  ఏజెంట్లు రాందాస్​, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్​లో జరిగిన సమావేశంలో జీఎం సంజీవరెడ్డి మాట్లాడారు. అజాగ్రత్తల కారణంగా ప్రమాదాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఏరియా ఇంజినీర్ బి.చంద్రశేఖర్ రెడ్డి, ఏజెంట్ ఏవీ రెడ్డి,  గ్రూప్ ఇంజినీర్ వీరన్న, గని మేనేజర్ అబ్దుల్ ఖదీర్ తదితరులు 
పాల్గొన్నారు.

కానిస్టేబుల్​ కుటుంబానికి అండగా ఉంటాం

ఇచ్చోడ,వెలుగు: జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన బందోబస్తుకు వెళ్లిన ఆదిలాబాద్​జిల్లా ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చవాన్ పరశురాం గుండెపోటుతో మృతిచెందడం బాధాకరమని ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి చెప్పారు. మృతదేహం స్వగ్రామం ఉట్నూర్​మండలం వడోని గ్రామానికి తీసుకువచ్చారు. బుధవారం ఎస్పీ గ్రామంలో జరిగిన కానిస్టుబుల్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అంత్యక్రియల కోసం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ .20 వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్​ఎస్పీ శ్రీనివాసరావు, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్దన్, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, సీఐ సైదారావు, ఎస్సై డి.సునీల్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


ఫీజు రీయింబర్స్​మెంట్​ కోసం ధర్నా

మంచిర్యాల, వెలుగు: ఫీజు రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ టీఎన్ఎస్​ఎఫ్​ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేపట్టారు. మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులతో ర్యాలీగా కలెక్టరేట్​కు చేరుకుని బైటాయించారు. టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్​కన్వీనర్​ సంజయ్​కుమార్​, టీఎన్​ఎస్​ఎఫ్​ రాష్ర్ట అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్​ మాట్లాడుతూ ప్రభుత్వం రెండేళ్లుగా సుమారు రూ.3300 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని అన్నారు. వివిధ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అన్నారు. పెండింగ్​ డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.  


డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు మృతి

ఆదిలాబాద్,వెలుగు: డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు మృతిచెందిందని బుధవారం బంధువులు హాస్పిటల్​ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ భాస్కర్ మాట్లాడుతూ సిరికొండ మండలం రాజన్ పేట గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళా మందాడి లక్ష్మి పురిటినొప్పులతో శనివారం రిమ్స్ ఆస్పత్రికి రాగా మగ శిశువుకు జన్మనిచ్చిందని, బుధవారం  తెల్లవారుజామున శిశువు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారన్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పసికందు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రిమ్స్ డైరక్టర్ జైసింగ్​రాథోడ్ సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


జెండాగూడ వాసికి ధమ్మదూత్​ అవార్డు

ఆసిఫాబాద్,వెలుగు: ఆసిఫాబాద్ మండలం జెండాగూడ గ్రామానికి చెందిన ఎం.లక్ష్మీనారాయణకు ధమ్మదూత్ బ్రాండ్ అంబాసిడర్ 2022  అవార్డు అందుకున్నారు. బుధవారం గగన్ మాలిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముంబయిలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ మనుమడు భీంరావు యశ్వంత్ రావు అంబేద్కర్, వియత్నాం, థాయ్ లాండ్, సింగాపూర్, జపాన్, కాంబోడియాకు చెందిన బౌద్ధ భిక్షువులు తదితరులు పాల్గొన్నారు. 23 సంవత్సరాలుగా జర్నలిస్టు గా సేవలు అందించినందుకు గాను తెలంగాణ నుంచి లక్ష్మీనారాయణకు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.