నాలుగు ఒప్పందాలపై పుతిన్ సంతకం

నాలుగు ఒప్పందాలపై పుతిన్ సంతకం
  • ఉక్రెయిన్​లోని 4 రీజియన్లు రష్యాలో విలీనం
  • లుహాన్స్క్, డొనెట్స్క్,ఖేర్సన్, జపోరిజియాను కలుపుకొన్నామన్న పుతిన్ 
  • అణుదాడులకూ వెనుకాడబోమని వార్నింగ్  
  • ఉక్రెయిన్​పై రాకెట్లు, మిసైల్స్​తో రష్యా దాడి 26 మంది మృతి 

దక్షిణ, తూర్పు ఉక్రెయిన్​లోని 4 రీజియన్లను తమ దేశంలో విలీనం చేసుకున్నట్లు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ప్రకటించారు. ఆ నాలుగు ప్రాంతాల్లో రెఫరెండం నిర్వహించామని, వాళ్లు అనుకూలంగా ఓటేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే రష్యాలో నాలుగు ప్రాంతాల విలీనాన్ని తాము ఎన్నటికీ ఒప్పుకోబోమని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ స్పష్టం చేశారు. మరో వైపు ఉక్రెయిన్​పై రష్యా శుక్రవారం రాకెట్లు, మిసైల్స్, సూసైడ్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 26 మంది చనిపోయారు. జపోరిజియా ప్రాంతంలోకి వెళ్లేందుకు ఎదురుచూస్తున్న వారిపై రష్యా మిసైళ్ల వర్షం కురిపించిందని ఉక్రెయిన్  వెల్లడించింది.


కీవ్/మాస్కో:  దక్షిణ, తూర్పు ఉక్రెయిన్ లోని నాలుగు రీజియన్ లను తమ దేశంలో విలీనం చేసుకున్నట్లు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ లోని జార్జియన్ హాల్ లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఉక్రెయిన్ లోని లుహాన్స్క్, డొనెట్స్క్, ఖేర్సన్, జపోరిజియా రీజియన్ లను రష్యాలోకి విలీనం చేస్తూ నాలుగు ఒప్పందాలపై పుతిన్ సంతకం చేశారు. తమ బలగాలు పాక్షికంగా ఆక్రమించుకున్న ఈ నాలుగు ప్రాంతాల్లో ఇటీవలే రెఫరెండం నిర్వహించిన రష్యా ఆ ప్రాంతాల ప్రజలు తమ దేశంలో చేరేందుకు అనుకూలంగా ఓటేశారని మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ఆ నాలుగు ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లు కూడా ఒప్పందాలపై శుక్రవారం సంతకాలు చేశారు. 

న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగానికీ సిద్ధం 

ఉక్రెయిన్​లోని ఆ నాలుగు ప్రాంతాలు ఇకపై రష్యాలో భాగమని పుతిన్ స్పష్టం చేశారు. ఆ ప్రాంతాలను కాపాడుకునేందుకు తాము అన్ని ఆయుధాలనూ ఉపయోగిస్తామని, న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగానికీ వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు వేసిన అమెరికానే తమకు అణు దాడులకు దారి చూపిందంటూ ఉక్రెయిన్, దాని మిత్ర దేశాలపై అణు బాంబులు వేసేందుకూ సిద్ధమని  పుతిన్ పరోక్షంగా హెచ్చరించారు. పశ్చిమ కూటమిని కూలగొట్టి, ప్రపంచానికి విముక్తి కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ‘‘ఇకపై వాళ్లు మా ప్రజలు. ఎప్పటికీ మా ప్రజలే. వారిని కాపాడుకుంటాం” అంటూ చెచెన్ నేత రమజాన్ కదిరోవ్, రక్షణ మంత్రి షెర్గీ షోయిగు, మాజీ ప్రెసిడెంట్ దిమిత్రీ మెద్వెదెవ్​తో కలిసి పుతిన్ చేతులు ఊపుతూ ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు విలీనం నేపథ్యంలో డాన్బాస్ ప్రాంతంలో రష్యా వేలాది బలగాలను మోహరించింది.

రష్యా రెఫరెండాలకు విలువ లేదు: యూఎన్ 

ఉక్రెయిన్​లోని లుహాన్స్క్, డొనెట్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలు తమవని రష్యా నిర్వహించిన రెఫరెండాలకు విలువలేదని యునైటెడ్ నేషన్స్ పేర్కొంది. ఉక్రెయిన్​కు చెందిన ఆ నాలుగు ప్రాంతాల స్టేటస్​లో ఎలాంటి మార్పులను గుర్తించరాదని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. పుతిన్ ఈ అక్రమ యుద్ధంలో ఓడిపోయాడని తాము భావిస్తున్నామని బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ అన్నారు. రష్యా రెఫరెండాలను పూర్తిగా 
ఖండిస్తున్నామని ఈయూ ప్రకటించింది.

నాటోలో చేరేందుకు ఉక్రెయిన్ అప్లికేషన్ 

ఉక్రెయిన్​లోని నాలుగు రీజియన్​లను రెఫరెండాల పేరుతో రష్యా విలీనం చేసుకోవడాన్ని తాము ఎన్నటికీ ఒప్పుకోబోమని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ స్పష్టం చేశారు. రష్యా తమ భూభాగాలను విలీనం చేసుకున్నట్లు ప్రకటించిన తర్వాత ఆయన వీడియో స్పీచ్ ను విడుదల చేశారు. నాటోలో చేరేందుకు తాము అధికారికంగా అప్లై చేశామని ఆయన ప్రకటించారు. ‘‘మేం నాటో కూటమిలో చేరేందుకు ఇప్పటికే తగిన స్టాండర్డ్స్ ను సాధించాం. నాటోలో చేరేందుకు ఉక్రెయిన్ అప్లికేషన్​పై సంతకం చేశాం. నాటోలో మా​కు ఫాస్ట్ ట్రాక్ మెంబర్షిప్ ఇవ్వాలి” అని ఆయన కోరారు. దేశ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, మొత్తం తమ దేశ భూభాగానికి విముక్తి కల్పించి తీరుతామని జెలెన్ స్కీ ప్రతిజ్ఞ చేశారు. రష్యా ప్రెసిడెంట్​గా పుతిన్ ఉన్నంతకాలం ఆ దేశంతో తాము చర్చలు జరిపే ప్రసక్తే లేదని కూడా ఆయన తేల్చిచెప్పారు.

రష్యా దాడుల్లో 26 మంది మృతి 

ఉక్రెయిన్​పై రష్యా శుక్రవారం భీకర దాడి చేసింది. రాకెట్లు, మిసైల్స్, డ్రోన్ల తో విరుచుకుపడింది. ఈ దాడిలో 26 మంది చనిపోయారు. జపోరిజియా ప్రాంతంలోకి వెళ్లేందుకు నిరీక్షిస్తున్న వారిపై రష్యా మిసైళ్ల వర్షం కురిపిం చిందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఆఫీసు తెలిపింది. ఈ అటాక్​లో 25 మంది చనిపోయారని, 55 మంది గాయపడ్డా రని వెల్లడించింది. దాడిలో వాహనాలు నాశనమయ్యాయని, ప్రయాణికులు మరణించారని, బిల్డింగులు కూడా కూలిపోయాయని పేర్కొంది. అలాగే దినిప్రో సిటీపైనా రష్యా దాడి చేసిందని రీజినల్ గవర్నర్ రెజ్నిచెంకో తెలిపారు. ఈ దాడులపై జెలెన్ స్కీ స్పందిస్తూ.. ‘‘రక్తదాహంతో రష్యా అలమటిస్తోంది. అదో టెర్రరిస్టు దేశం. వారి దాడులను మేం దీటుగా ఎదుర్కొంటున్నం. రష్యా దాడిలో చనిపోయిన ప్రతీ ఉక్రెనియన్ మృతికి పుతిన్ జవాబు చెప్పాల్సి ఉంటుంది” అని అన్నారు.