కేసీఆర్​ దావత్​ల బువ్వ తిన్న ఆగవ్వకు అస్వస్థత..మరో 40 మందికి వాంతులు, విరేచనాలు 

కేసీఆర్​ దావత్​ల బువ్వ తిన్న ఆగవ్వకు అస్వస్థత..మరో 40 మందికి వాంతులు, విరేచనాలు 

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో ఈ నెల 22న సీఎం కేసీఆర్​ఇచ్చిన దావత్ లో బువ్వ తిన్న40 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది వాంతులు.. విరేచనాలతో బాధపడ్డారు.  వీరిలో కేసీఆర్​తన దోస్తు అని చెప్పుకున్న ఆకుల ఆగవ్వ కూడా ఉన్నారు. ఈ నెల 22న వాసాలమర్రిలో సీఎం కేసీఆర్​ గ్రామసభ నిర్వహించారు. సభలో భాగంగా అదేరోజు ఊరోళ్లందరికీ కేసీఆర్​దావత్​ఇచ్చారు. ప్రజలతో కలిసి భోజనం చేశారు. అనంతరం సభా వేదికపై తన దోస్త్​ ఆకుల ఆగవ్వతో కలిసి భోజనం చేశానని సీఎం చెప్పుకున్నారు. అయితే అదే రోజు సాయంత్రం నుంచి కొందరికి కడుపులో నొప్పి.. మరికొందరికి వాంతులు, విరేచనాలు కావడంతో కంగారు పడ్డారు. వారిలో ఆగవ్వకు బీపీ కూడా పెరగడంతో సోమవారం రాత్రి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి ట్రీట్​మెంట్​అందించారు. బుధవారం ఉదయం డిశ్చార్జ్​ చేశారు. మిగిలిన వారిలో కొందరు తుర్కపల్లిలో ట్రీట్​మెంట్​తీసుకోగా.. మరికొందరు వాసాలమర్రిలోని ఆర్​ఎంపీ వద్ద ట్రీట్​మెంట్​తీసుకున్నారు. హెల్త్​ స్టాఫ్​కూడా వచ్చి టాబ్లెట్లు ఇచ్చారు. అయితే ఈ విషయం బయటపడకుండా జిల్లా ఆఫీసర్లు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

భువనగిరిలో ట్రీట్​మెంట్​ చేసిన్రు
సీఎం మీటింగ్​లో పాల్గొన్న రోజు సాయంత్రం కడుపులో నొప్పిగా అనిపించింది. విరేచనాలు అయినయ్​. తుర్కపల్లికి పోతే బీపీ కూడా పెరిగిందని చెప్పిన్రు. రాత్రి భువనగిరి దవాఖానకు తీసుకెళ్లి ట్రీట్​మెంట్ ఇచ్చిన్రు. ఇప్పుడు మంచిగైన.  –ఆగవ్వ, వాసాలమర్రి