ఏపీలో ఓట్ల తొలగింపు: లక్షన్నర అప్లికేషన్ల పెండింగ్

ఏపీలో ఓట్ల తొలగింపు: లక్షన్నర అప్లికేషన్ల పెండింగ్
  • కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి ఫారం-7 దరఖాస్తులు
  • అనుమతి వస్తే తొలగింపు..  లేదంటే మార్కింగ్: ఏపీ సీఈవో

అమరావతి, వెలుగు: ఏపీలో ఓటరుగా పేరు నమోదుకు నెల 15 వరకే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. కేం ద్ర  ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రం లో 3 కోట్ల 82 లక్షల 31 వేల, 26 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఓటరు జాబితాలో ఓట్ల తొలగింపు సాధ్యం కాదు. జనవరి 11న తుది ఓటర్ల జాబితా ప్రకటించాక ఓట్లు తొలగించాలని 9,27,542 ఫారం-7 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 7,24,914 దరఖాస్తులు పరిశీలించాం. 5,25,957 దరఖాస్తులు తిరస్కరించాం. 1,58,124 పెండింగ్ లో ఉన్నాయి. కేంద్రం ఎన్నికల సంఘం అనుమతిస్తే వాటిని తొలగిస్తాం. లేదా జాబితాలో మార్కిం గ్ చేస్తాం’ అని అన్నారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. రాజకీయ పార్టీల నేతలు, అధికారులకు వేర్వేరు కోడ్ రూల్స్ ఉన్నాయని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. “రాష్ట్రం లో మొత్తం 45,920 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో సమస్యాత్మక పోలింగ్ కేం ద్రాలు 9,345 . నాలుగు గ్రేడ్లుగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను విభజించాం. ఎన్నికల్లో బందోబస్తు కోసం 58,778 మంది పోలీసులను వినియోగిస్తాం ” అని ద్వివేది అన్నారు. ప్రభుత్వం ఆదివారం ఇచ్చిన రుణమాఫీ జీవోను పరీశిలిస్తున్నట్లు చెప్పారు. పసుపు-కుంకుమ పథకం కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనలో ఉందన్నారు.