వీఆర్ఏల భవిష్యత్ కార్యాచరణ రిలీజ్

వీఆర్ఏల భవిష్యత్ కార్యాచరణ రిలీజ్

హైదరాబాద్: వీఆర్ఏల  భవిష్యత్తు కార్యాచరణను వీఆర్ఏ రాష్ట్ర జేఏసీ రిలీజ్ చేసింది. ఇవాళ సీసీఎల్ఏ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆ సంఘం బాధ్యులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ రమేష్ బహదూర్, జనరల్ సెక్రటరీ దాదేమియా మాట్లాడుతూ... తమ సమస్యలు పరిష్కరించాలంటూ  కొన్ని నెలలుగా  ఉద్యమం చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే పలు కార్యక్రమాలు చేపట్టున్నామని తెలిపారు. అందులో భాగంగా  నెల 11న రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో వీఆర్ఏల పే స్కేల్ కోసం సమ్మె చేస్తున్న కాలంలో మరణించిన వీఆర్ఏలకు సంతాపం తెలిపుతామన్నారు. అదే విధంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులను కలిసి... వీఆర్ఏల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేలా ఒత్తిడి తెస్తామన్నారు. 

ఈ నెల 12న హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ (జూబ్లీహిల్స్) వద్ద రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన వీఆర్ఏలు ప్లకార్డులు చేతబూని నిరసన తెలుపుతారని చెప్పారు. ఈ నెల 13న ‘ఛలో అసెంబ్లీ’ కి పిలుపునిచ్చామని, రాష్ట్రంలోని 23 వేల వీఆర్ఏలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వీఆర్ఏ జేఏసీ నాయకులు సాయన్న, వెంకటేశ్ యాదవ్, షేక్ మహ్మద్ రఫీ, లక్ష్మల నర్సింహ రావు, వంగూరు రాములు, గోవింద్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.