నేడు రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏల వంటావార్పు

నేడు రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏల వంటావార్పు
  • సమ్మెలోకి వీఆర్ఏలు, విధుల బహిష్కరణలో వీఆర్వోలు 

హైదరాబాద్, వెలుగు: మండల, గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలకు బ్రేక్ పడింది. రెవెన్యూ శాఖలో కీలకమైన 23 వేల మంది వీఆర్ఏలు జులై 25 నుంచి సమ్మెలోకి వెళ్లడం, 5 వేల మంది వీఆర్వోలు కూడా విధుల బహిష్కరణకు పిలుపునివ్వడంతో రెవెన్యూ శాఖలో అనేక క్షేత్ర స్థాయి పనులకు అవాంతరాలు ఏర్పడే పరిస్థితి నెలకొంది. తమకు పే స్కేల్ అమలు చేయాలని వీఆర్ఏలు, తమకు సర్వీస్ ప్రొటెక్షన్ కల్పించాలని, జాబ్ చార్ట్ ప్రకటించాలని వీఆర్వోలు రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వీఆర్ఏలు గతంలో సీసీఎల్ఏను ముట్టడించినా, జులై 21 నుంచి 23 వరకు జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించలేదు. అంతేగాక వీఆర్ఏలపై  పోలీసులు పలు చోట్ల లాఠీచార్జీ చేసి అరెస్టులు చేశారు. మహబూబాబాద్ సీఐ సతీశ్ ఏకంగా కాల్చి పారేస్తానని బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలోనే సర్కార్ తీరుకు నిరసనగా వీఆర్ఏలు ఆందోళనను ఉధృతం చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వంటావార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 

జనానికి, తహసీల్దార్లకు ఇబ్బందే

వీఆర్వోలు, వీఆర్ఏల ఆందోళనతో రెవెన్యూ పాలన స్తంభించింది. మండలంలో క్యాస్ట్, ఇన్ కం, ఈడబ్ల్యూఎస్, లోకల్, డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్లు, కల్యాణలక్ష్మి, ధరణి, రేషన్ కార్డు దరఖాస్తులు ఇలా ఏ అప్లికేషన్ వచ్చినా వీఆర్వోలు లేదంటే వీఆర్ఏలు ఫీల్డ్ ఎంక్వైరీ చేయాల్సిందే. వారిచ్చే రిపోర్ట్ ప్రకారమే తహసీల్దార్లు సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ప్రస్తుతం వారంతా డ్యూటీకి రాకపోవడంతో దరఖాస్తుల వెరిఫికేషన్ భారమంతా రెవెన్యూ ఇన్ స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్ పై పడనుంది. వెరిఫికేషన్ లో జరిగే జాప్యం వల్ల సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. ఉన్నతాధికారులు ఏ రిపోర్ట్ కావాలని అడిగినా తహసీల్దార్లు వీఆర్వోలు, వీఆర్ఏలను పురమాయిస్తుంటారు. అలాగే ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రుల పర్యటనల సమయంలోనూ ప్రొటోకాల్ ఏర్పాట్లన్నీ వీఆర్వోలు, వీఆర్ఏలే చేస్తుంటారు. వీళ్లు డ్యూటీలో లేకపోవడంతో తహసీల్దార్లకు ఇబ్బందులు తప్పడం లేదు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద సహాయక కార్యక్రమాలపై వీఆర్ఏల సమ్మె, వీఆర్వోల విధుల బహిష్కరణ ఎఫెక్ట్ పడింది.

జీవో వస్తేనే సమ్మె విరమణ.. 

వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని సీఎం అనేకసార్లు స్వయంగా ప్రకటించారు. కానీ ప్రగతి భవన్ లో, అసెంబ్లీలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అందుకే వీఆర్ఏలకు ప్రభుత్వంపై నమ్మకం పోయింది. జీవో వస్తే తప్ప సమ్మెను విరమించేది లేదు.

- రమేశ్​ బహదూర్, వీఆర్ఏ జేఏసీ నేత