రష్యాకు ముచ్చెమటలు పట్టించి.. తిరిగి బెలారస్ కు పయనమైన ప్రిగోజిన్

రష్యాకు ముచ్చెమటలు పట్టించి.. తిరిగి బెలారస్ కు పయనమైన ప్రిగోజిన్

రష్యా పై తిరుగుబాటు చేసి వెనక్కి తగ్గిన  వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్  రోస్తోవ్ ఆన్ డాన్ ను వీడి తిరిగి బెలారస్ కు వెళ్లారు.  ఆయనతో పాటు ప్రైవేట్ సైన్యం తిరిగి సరిహద్దులోని వాటి స్థావరాలకు వెళ్లాయని రష్యా అధికారులు తెలిపారు.  ప్రిగోజిన్ పై నమోదైన క్రిమినల్ కేసులు కూడా  ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు.

రష్యా అధ్యక్షుడు  వ్లాదిమిర్ పుతిన్ పెంచి పోషించిన యవ్జెనీ ప్రిగోజిన్ ఆయనపైనే యుద్దానికి దిగారు. రష్యా నాయకత్వాన్ని, కూలదోసి, కొత్త అధ్యక్షుడిని నియమిస్తామంటూ జూన్ 24న ప్రకటించారు. చావడానికైనా చంపడానికైనా సిద్ధమని లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.  రెండు నగరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అయితే అనూహ్యంగా జూన్ 24న రాత్రి ప్రిగోజిన్ వెనక్కి తగ్గారు. కవాతను నిలిపివేయాలని, ఉక్రెయిన్ లోని క్యాంప్ కు తిరిగి వెళ్లిపోవాలని తన సైన్యాన్ని ఆదేశించారు.  అనవసరంగా రష్యన్ల రక్తం చిందించడం ఇష్టంలేకనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రిగోజిన్ ప్రకటించారు. 

అయితే బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వం తర్వాత ప్రిగోజిన్ మెత్తబడ్డారు. తన తిరుగుబాటు ప్రయత్నాన్ని మధ్యలోనే నిలిపివేశారు.