మంత్రి పట్టాలిచ్చినా  ఇండ్లు ఇస్తలేరు

మంత్రి పట్టాలిచ్చినా  ఇండ్లు ఇస్తలేరు
  •     హుస్నాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఎదురుచూపులు
  •      రెండు నెలల కింద ఓపెన్​ చేసిన మంత్రి కేటీఆర్​
  •     ఇంకా కొనసాగుతున్న పనులు
  •     అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు

సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు మొదటి నుంచి నిరాశే మిగులుతోంది. ఎన్నో ఆందోళనల మధ్య రెండు నెలల కింద మంత్రి కేటీఆర్ ఇండ్లను ప్రారంభించారు. మంత్రి ప్రారంభించినా ఇప్పటి వరకు లబ్ధిదారులకు  ఇండ్లను అప్పగించలేదు. ఇంకా ఇండ్ల పనులు కొనసాగుతూనే ఉన్నాయని ఆఫీసర్ల తీరుపై మండిపడుతున్నారు. హుస్నాబాద్​ మున్సిపాలిటీకి రెండు విడతలుగా మొత్తం 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరయ్యాయి.

పట్టణ శివార్​లో జీ ప్లస్ టూ పద్ధతిలో ఇండ్లు నిర్మిస్తుండగా  నత్తనడకన సాగుతూ వచ్చాయి. మంజూరైన నాలుగేండ్ల తరువాత నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా మొత్తం 1,426 అప్లికేషన్లు అందాయి. 280  ఇండ్ల నిర్మాణమే కాగా, మిగతా ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అందిన అప్లికేషన్లను పరిశీలించిన ఆఫీసర్లు తొలి విడతగా  489 మందితో  జాబితాను విడుదల చేసి కొందరికి ఇండ్లను కేటాయించారు.  మొదట్లో జాబితాలో అనర్హులున్నారంటూ దరఖాస్తుదారులు ఆందోళనకు దిగారు.  అధికారులు రీ సర్వే చేసి రెండు నెలల కిందట మొదటి విడతగా 280 మందికి ఇండ్లను కేటాయించారు.

రెండో విడతలో జాబితాలో  పేర్లున్న వారికి  మిగిలిన ఇండ్లను పంపిణీ చేస్తామని ప్రకటించారు. అయితే మొదటి విడతలోని ఇండ్లను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. కానీ రెండు నెలలు గడుస్తున్నా ఇంత వరకు తమకు కేటాయించిన ఇండ్లల్లోకి వెళ్లే పరిస్థితి కనిపించకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదే విషయమై మున్సిపాలిటీ అధికారులను అడిగితే తమకు సంబంధం లేదని చెప్తున్నారు.  

అసంపూర్తి పనులతో జాప్యం

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను ఆర్భాటంగా ప్రారంభించినా ఎలక్ట్రికల్ వైరింగ్, డోర్స్, విండోస్ , ఫ్లోరింగ్, వాల్  ప్లాస్టరింగ్ పనులు పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని ప్లాట్లకు సంబంధించి మెట్ల రెయిలింగ్, కిచెన్ ప్లాట్​ ఫామ్స్  తో పాటు  సానిటరీ ఫిట్టింగ్స్​ ప్రారంభం కాలేదు. ఈ పనులన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేందుకు ఇంకెంత టైం పడుతుందో తెలియడం లేదు.  ఇదిలా ఉండగా గౌరవెల్లి ప్రాజక్టు ముంపు గ్రామమైన గుడాటిపల్లి నిర్వాసితులకు అధికారులు ఆ ఇండ్లలో తాత్కాలిక వసతి కల్పించారు.  గుడాటిపల్లికి చెందిన 20 కుటుంబాలను బలవంతంగా నెల రోజుల కింద గ్రామం నుంచి తరలించి ఈ ఇండ్లలో వదిలిపెట్టారు. వీరు ఖాళీ చేస్తేనే మున్సిపాలిటీకి చెందిన లబ్ధిదారులు ఇండ్లల్లోకి వచ్చే పరిస్థితి ఉంది. 

అద్దె కట్టుకోలేక ఇబ్బందులు 

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దొరికినా ఇంకా గృహ ప్రవేశాలు జరగకపోవడంతో పలువురు పేదలకు అద్దె బాధలు తప్పడం లేదు. వేలల్లో  కిరాయిలు కడుతూ ఇబ్బంది పడుతున్నామని వారు వాపోతున్నారు. వెంటనే పెండింగ్​ పనులు పూర్తి చేసి గృహప్రవేశాలు చేయించాలని కోరుతున్నారు. 

ఇండ్లు అప్పగించాలె 

హుస్నాబాద్ మున్సిపాల్టీలో అధికారులు రూపొందించిన జాబితా ప్రకారం వెంటనే లబ్ధిదారులకు ఇండ్లు అప్పగించాలి. మంత్రి ప్రారంభించి రెండు నెలలు కావస్తున్నా ఇంకా ఇండ్లు ఇవ్వకపోవడం సరికాదు. అద్దెలు చెల్లిస్తూ ఆర్థిక భారాన్ని మోస్తున్న పేదలను దృష్టిలో పెట్టుకొని ఇండ్లను త్వరగా అందుబాటులోకి తేవాలి. 

- గడిపె మల్లేశ్, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు

పూర్తికాకుండా ఎలా ప్రారంభించారు?

హుస్నాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాకుండానే ఇండ్లు ఎందుకు ప్రారంభించారు? ఇలా గొప్పలకు కార్యక్రమాలు చేసి లబ్ధిదారులను నిరాశకు గురిచేయడం సబబు కాదు.  కేవలం ఎన్నికల కోసమే అధికార పార్టీ లీడర్లు ఇలాంటి పనులు చేస్తూ లబ్ధిదారులను మోసం చేస్తున్నారు. ఈ పద్ధతి మారాలి. 

బత్తుల శంకర్ బాబు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు, హుస్నాబాద్

పనులు పూర్తి చేసేలా చర్యలు 

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కు సంబంధించి కొన్ని పనులు మిగిలిపోవడంతో గృహ ప్రవేశాలకు ఇబ్బంది కలుగుతోంది. ఆ పనులు వెంటనే పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించాం. అన్ని పనులు పూర్తి చేసి మరికొన్ని రోజుల్లోనే లబ్ధిదారుల చేత గృహ ప్రవేశాలు చేయిస్తాం.

-   ఆకుల రజిత, మున్సిపల్ చైర్ పర్సన్, హుస్నాబాద్