తాలిబన్ల కోసమే వెయిట్ చేస్తున్నా.. వచ్చి నన్ను చంపండి

V6 Velugu Posted on Aug 17, 2021

తాను తాలిబన్ల కోసమే వెయిట్ చేస్తున్నాకని.. వచ్చి తనను చంపాలని ఆఫ్ఘనిస్తాన్ లో మొదటిసారి మహిళా మేయర్ గా ఎన్నికైన జరీఫా గఫారీ అన్నారు. ఆఫ్ఘన్ దేశాన్ని తాలిబన్లు ఆదివారం స్వాధీనం చేసుకున్న తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలివి. ‘నేను నా భర్తతో ఒంటరిగా ఉన్నాను. మమ్మల్ని కాపాడటానికి ఎవరూ లేరు. వీలైతే వచ్చి మమ్మల్ని చంపండి. అష్రఫ్ ఘనీ నేతృత్వంలోని నాయకులందరూ పారిపోయారు. ఈ విషయం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. నేను ఎక్కడికి వెళ్లగలను? ఈ రోజు నేను నిస్సహాయంగా ఉన్నాను. నేను నా కుటుంబసభ్యుల భద్రత గురించి ఆలోచిస్తున్నాను. అయినా కాబూల్ తాలిబన్లకు లోంగిపోదని నేను భావిస్తున్నాను’ అని దేశంలోనే తొలిసారిగా ఎన్నికైన అతి చిన్నవయస్కురాలైన మేయర్ జరీఫా అన్నారు.

జరీఫా గఫారీ 2018లో మైదాన్ వార్దక్ ప్రావిన్స్ కు తొలి మహిళా మేయర్ గా ఎన్నికైంది. ఆమె కొన్నివారాల క్రితం మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి మంచి భవిష్యత్తు రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేసింది. జరీఫాకు గతంలో తాలిబాన్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఆమె చంపడానికి తాలిబన్లు చేసిన మూడో ప్రయత్నం విఫలం కావడంతో.. 20 రోజుల తర్వాత ఆమె తండ్రి జనరల్ అబ్దుల్ వాసి గఫారీని గత ఏడాది నవంబర్ 15న మిలిటెంట్లు కాల్చి చంపారు. దేశంలో ఏం జరుగుతుందో యువతకు తెలుసని.. వారు సోషల్ మీడియా ద్వారా అన్నీ పంచుకుంటారని వ్యాఖ్యానించింది. తాను తమ పౌరుల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటానని తేల్చి చెప్పింది. ప్రస్తుతం కాబూల్‌లో ఉగ్రవాద దాడుల్లో గాయపడిన సైనికులు మరియు పౌరుల సంక్షేమ బాధ్యతలను గఫారీ చూసుకుంటుంది. తాలిబాన్లను ఎదురించడానికి తన ప్రయత్నాలు ప్రారంభించింది.

గత ఆఫ్ఘన్ ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తులపై లేదా అధికారులపై ప్రతీకారం తీర్చుకోబోమని తాలిబన్లు హామీ ఇచ్చినప్పటికీ.. వారిని నమ్మే పరిస్థితిలో దేశ ప్రజలు లేరు. తాలిబన్లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడంతో మహిళలు చాలా ఎక్కువగా భయపడుతున్నారు. గతంలో తాలిబన్లు మహిళల విద్యను నిలిపివేయడంతో పాటు.. వారిని ఉద్యోగాల నుంచి నిషేధించారు. నిబంధనలు అతిక్రమించిన వారికి అనాగరిక శిక్షలు విధించారు. దాంతో దేశవ్యాప్తంగా మహిళలు వణికిపోతున్నారు.

Tagged Afghanistan, Talibans, Kabul, Ashraf Ghani, first female mayor, Mayor Zarifa Ghafari, Maidan Wardak province

Latest Videos

Subscribe Now

More News