
హైదరాబాద్ లోని TSPSC ఆఫీసు వద్ద వివాదాస్పద వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. టీఎస్పీఎస్సీ జిరాక్స్ సెంటర్ అంటూ నాంపల్లి టీఎస్పీఎస్సీ కార్యాలయం సమీపంలో ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి. ఇచ్చట అన్ని రకముల ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశపత్రములు లభించును అంటూ మార్చి 22, బుధవారం పలు డిమాండ్లతో ఓయూ జేఏసీ సభ్యులు పోస్టర్లు అతికించారు.. ఇది ఉద్యోగ నియామక కార్యాలయం కాదు.. జిరాక్స్ సెంటర్ అని వాల్ పోస్టర్లలో వెల్లడించారు.
"ముఖ్యమంత్రి.. మీరు తక్షణమే తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి.. ప్రశ్నపత్రాల లీకేజీలో మీ కుటుంబ సభ్యుల పాత్రలేదని చెప్పడానికి వెంటనే కేసును సీబీఐకి అప్పగించి టీఎస్పీఎస్సీ బోర్డును, సంబంధిత శాఖ మంత్రిని భర్తరఫ్ చేయండి.. నష్టపోయిన విద్యార్థలకు ఈ నెల నుంచి నెలకు 10 వేల రూపాయల చొప్పున మళ్లీ పరీక్ష నిర్వహించే వరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి" అని పోస్టర్ లో డిమాండ్స్ పేర్కొన్నారు.