రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి : వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి

రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి :  వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు :  ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం చాలా తక్కువగా నమోదయ్యిందని రైతులు వాతావరణానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని వనపర్తి కలెక్టర్​ ఆదర్శ్​ సురభి సూచించారు. జిల్లా కేంద్రంలోని పద్మావతి శ్రీనివాస గార్డెన్‌‌లో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కిసాన్ మేళా2026’ లో ఆయన మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదైనందున, వరి సాగుకు బదులుగా వాతావరణానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. 

జిల్లాలో మినుము సాగు పెరగడాన్ని అభినందించిన ఆయన, మూడేండ్ల పాటు అంతర పంటలతో పామాయిల్ సాగు చేస్తే ముప్పై ఏండ్ల పాటు లాభాలు ఆర్జించవచ్చని తెలిపారు. వచ్చే ఏడాది జిల్లాలో యూనిక్ పామ్ ఆయిల్ కంపెనీ ప్రారంభమవుతుందని, ప్రతి మంగళవారం రైతు వేదికల ద్వారా నిర్వహించే ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మేళాలో వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన మేలురకం విత్తనాలు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల ప్రదర్శనలను తిలకించారు.  సమావేశంలో  జిల్లా వ్యవసాయాధికారి ఆంజనేయులు, మన్సిపల్​ చైర్​ పర్సన్​ మాధవి, వైస్​ చైర్మన్ మధుసూదన్​గౌడ్, కేవీకే శాస్త్రవేత్త  రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.