వనపర్తి టౌన్, వెలుగు: వనపర్తి పట్టణంలోని పాత మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన సమీకృత మార్కెట్‌ను ప్రజలు, వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి మార్కెట్ మొదటి అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో అద్దెలు ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు వాటిని సగానికి తగ్గించి లాటరీ పద్ధతిలో పారదర్శకంగా కేటాయించినట్లు తెలిపారు.
భవిష్యత్‌లో ఇక్కడ గోల్డ్ బజార్, టౌన్ హాల్‌ను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం నాగవరంలో మత్స్యకారుల అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన, నల్లచెరువును టూరిజం హబ్‌గా మారుస్తామని, మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వీరాయపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు.
