సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు : వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి

సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు : వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి/కొత్తకోట, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15న వనపర్తి జిల్లా కొత్తకోటలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సీఎం పర్యటనపై సోమవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌‌‌‌రెడ్డి, ఎస్పీ సునీతారెడ్డితో కలిసి రివ్యూ చేశారు. కొత్తకోట ప్రభుత్వ గర్ల్స్‌‌‌‌ హైస్కూల్‌‌‌‌ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు, విద్యార్థులతో నిర్వహించనున్న ముఖాముఖిని విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బారికేడ్లు, వేదిక, సౌండ్ సిస్టమ్, విద్యుత్, తాగునీరు తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే 9, 10వ తరగతి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎస్పీ బందోబస్తుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

డిప్యూటీ సీఎం పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు

గద్వాల, వెలుగు: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటనకు పక్కాగా ఏర్పాటు చేస్తున్నట్లు జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. సోమవారం మల్దకల్ మండలం కుర్తిరావులచెరువు గ్రామంలో కొత్తగా నిర్మించిన విద్యుత్తు సబ్ స్టేషన్‌‌‌‌ను పరిశీలించారు. మంగళవారం విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం వస్తున్నారన్నారు. ప్రారంభం అనంతరం బహిరంగ సభ ఉంటుందన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. అనంతరం గ్రామంలో ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు.