- కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వచ్చే 15 రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి స్పష్టం చేశారు. గురువారం అడిషనల్ కలెక్టర్ వినోద్ కుమార్‌తో కలిసి ఆయన వనపర్తి శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అదనంగా ఏర్పాటు చేసిన గోదామును, అక్కడ జరుగుతున్న అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలిస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
జిల్లాలో గత రెండేండ్లుగా రికార్డు స్థాయిలో దిగుబడి వస్తోందని, దీనివల్ల గోదాముల్లో స్థలం కొరత ఏర్పడిందని వివరించారు. కోతలు ఆలస్యం కావడం, హమాలీల కొరత వల్ల ప్రక్రియ కొంత నెమ్మదించినా, ఇప్పటివరకు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మరో లక్ష టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించి ధాన్యాన్ని వేగంగా దించుకోవాలని సూచించారు.
