IPL 2024: శ్రీలంక స్టార్ క్రికెటర్‌పై ఐసీసీ నిషేధం..సంతోషంలో సన్ రైజర్స్ ఫ్యాన్స్

IPL 2024: శ్రీలంక స్టార్ క్రికెటర్‌పై ఐసీసీ నిషేధం..సంతోషంలో సన్ రైజర్స్ ఫ్యాన్స్

శ్రీలంక స్టార్ స్పిన్నర్, టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగ కెరీర్ ఊహించని మలుపులతో సాగుతుంది. టెస్టు క్రికెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అందరికీ షాక్ ఇచ్చిన ఈ లంక స్పిన్నర్.. ఒక్క రోజు గడవకముందే నిషేధానికి గురయ్యాడు. ఐసీసీ కోడ్‌ ఉల్లంఘించినందుకు ఇతనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కొరడా ఝళిపించింది. రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల నిషేధం విధిస్తూ..మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించారు.

సోమవారం ఛటోగ్రామ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే సందర్భంగా హసరంగ ఫీల్డ్‌ అంపైర్‌ పట్ల క్రమశిక్షణ తప్పాడు. ఈ ఓవర్ పూర్తి చేసిన తర్వాత అతను అంపైర్ నుంచి బలవంతంగా తన క్యాప్ ను లాక్కున్నాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8ను ఉల్లంఘించినందుకు హసరంగ దోషిగా తేలింది. దీంతో ఈ లెగ్ స్పిన్నర్ ఖాతాలో మూడు డీ మెరిట్‌ పాయింట్లు కూడా చేరాయి. హసరంగపై ఐసీసీ నిషేధం పడటం ఇది రెండోసారి. టీ20 సిరీస్‌ సందర్భంగా కూడా ఇదివరకే ఆఫ్ఘనిస్తాన్‌ తో జరిగిన సిరీస్ లో చేసిన తప్పిదాల కారణంగా సస్పెండయ్యాడు.

మొత్తంగా అతని డీమెరిట్ పాయింట్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. దాంతో నిబంధనల మేరకు ఐసీసీ వాటిని నాలుగు సస్పెన్షన్‌‌ పాయింట్లుగా మార్చింది. రాబోయే రెండు టెస్టుల్లో పాల్గొనకుండా బ్యాన్‌‌ చేసింది. ఈ నేపథ్యంలో నేషనల్‌‌ టీమ్‌‌కు దూరం కానున్న  హసరంగ  ఐపీఎల్‌‌ 17వ సీజన్‌లో సన్‌‌ రైజర్స్‌‌ హైదరాబాద్‌‌కు తొలి మ్యాచ్‌‌ నుంచే అందుబాటులోకి రానున్నాడు. దీంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ తెగ సంతోషంతో ఉన్నారు.