లాంగ్ జంప్ చేస్తే కలెక్టర్ కొలువిస్తరా? : మహిళా అభ్యర్థి

లాంగ్ జంప్ చేస్తే కలెక్టర్ కొలువిస్తరా? : మహిళా అభ్యర్థి

"ఒక నిరుద్యోగి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలి అంటే.. బుక్స్ కాదు.. నాలెడ్జ్ కాదు.. గ్రౌండ్ లో నాలుగు మీటర్ల జంప్ చేయాలి, రన్నింగ్ చేయాలి. 4 మీటర్ల జంప్ చేస్తే కలెక్టర్ పోస్టు కూడా ఇస్తరేమో తెలంగాణలో.." అని ఓ మహిళా నిరుద్యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రంలో 22 ప్రశ్నలు తప్పు ఇచ్చినా... మెరిట్ వచ్చిన స్టూడెంట్ ని చిన్న చిన్న కారణాలతో తీసివేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్స్ కావాలా.. లేదంటే 4 మీటర్లు జంప్ చేసే పర్సన్ కావాలా అని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. లాంగ్ జంప్ విషయంలో లక్షా యాభై వేల మంది అభ్యర్థులు ఉన్నారని, వాళ్ల ప్రిలిమ్స్ పేపర్ ఒకసారి స్కాన్ చేసి చూడాలని డిమాండ్ చేశారు. అన్ని తప్పులున్న పేపర్లో కూడా 130, 130కి పైగా మార్కులు వచ్చిన అభ్యర్థులున్నారని చెప్పారు.

వాళ్లందరూ పోరాటం చేస్తున్నారని మహిళా అభ్యర్థి అన్నారు. ఒక ఎలక్షన్ పోతే ఇంకో ఎలక్షన్ అని మీరు కూర్చోవడం లేదు కదా.. అలాంటప్పుడు మేమెందుకు ఈ నోటిఫికేషన్ కాకపోతే మరో నోటిఫికేషన్ అని ఎందుకు కూర్చోవాలి అని ఆమె నిలదీశారు. తాము సర్వీస్ చేయడానికి బయటికి వచ్చామని, గవర్నమెంట్ ఇచ్చే జీతాలకు ఆశపడి రాలేదని చెప్పారు. ఇటీవల తాము వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే.. తమను క్రిమినల్స్ ను తీసుకెళ్లినట్టు.. వ్యాన్ లో తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే తాము చదువుకొని, అడగడం తప్పన్నమాట అని అన్నారు. ఒక్క వారంలో ముగ్గురు చనిపోయారని, ఒక ప్రాణం విలువ ఒక ఇంటికే తెలుస్తుందని ఆమె చెప్పారు. ఆ ప్రాణం విలువ మీకు కనిపించకపోవచ్చు కానీ... తిండి కూడా తినకుండా ఆ కుటుంబం శోకంలో మునిగిపోయిందన్నారు. ఆ బాధ మీకు అర్థం కావట్లేదా అని ప్రశ్నించారు. ఈవెంట్స్ అయిపోయిన నుంచి ఏ ఒక్క అభ్యర్థీ సరిగా నిద్ర కూడా పోవడం లేదని, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఎదురుచూడాలి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.