- మేడిపల్లిలో రైతులు వర్సెస్ హెచ్ఎండీఏ
- రైతులకు భూమి ఇవ్వకుండానే లేఅవుట్ లోని ప్లాట్ల వేలం
- ఇప్పటికే 31 ప్లాట్ల వేలం పూర్తి
- అధికారుల తీరుతో అడ్డం తిరిగిన రైతులు
- హెచ్ఎండీఏ లేఅవుట్ కు భూములు ఇవ్వబోమని స్పష్టం
- ఎస్సీ, ఎస్టీ కమిషన్, హైకోర్టును ఆశ్రయించిన రైతులు
హైదరాబాద్/మేడిపల్లి, వెలుగు: మేడిపల్లిలో చేసిన లేఅవుట్విషయంలో హెచ్ఎండీఏ, రైతులకు మధ్య వార్నడుస్తోంది. ల్యాండ్ పూలింగ్ టైంలో ఇస్తామన్న ప్లాట్లు ఇవ్వకపోవడంతో రైతులు అడ్డం తిరిగారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్, హైకోర్టును ఆశ్రయించారు. హెచ్ఎండీఏకు భూములు ఇవ్వబోమని చెప్పడంతో కోర్టు స్టే ఇచ్చింది. మేడిపల్లిలోని సర్వే నంబర్ 62లో మొత్తం 126 ఎకరాల భూమి ఉంది. ఇందులో10 ఎకరాలు పట్టా భూమి కాగా, మిగిలిన 116 ఎకరాలు అసైన్డ్ భూములు. ఈ మొత్తాన్ని నాలుగేండ్ల కిందట ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 58 ఎకరాలను రాచకొండ కమిషనరేట్ కు అప్పగించింది. 55 ఎకరాల్లో లేఅవుట్ చేయాలని హెచ్ఎండీఏ ప్లాన్ చేసింది. ఎన్నో ఏండ్లుగా అసైన్డ్భూములను సాగుచేసుకుంటున్న రైతులకు లేఅవుట్డెవలప్ చేశాక ప్లాట్లు అప్పగిస్తామని హెచ్ఎండీఏ అధికారులు హామీ ఇచ్చారు. నేటికా చాలా మందికి పరిహారం ఇవ్వలేదు. ఎంత ఇస్తారో చెప్పలేదు. మొత్తం 38 కుటుంబాల నుంచి హెచ్ఎండీఏ భూములు తీసుకోగా, 22 మందికి ప్లాట్లు ఇవ్వడం లేదు. దీంతో 11 మంది రైతులు హైకోర్టుని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీంతో అధికారులు ఆ 11 మంది రైతులకు సంబంధించిన 33 ఎకరాలను వదిలిపెట్టి మిగిలిన వాటిలో హెచ్ఎండీఏ ప్లాట్ల వేలాన్ని మొదలు పెట్టింది. ఇప్పటికే ఓ దఫా వేలం పూర్తయింది. మరో దఫా వచ్చే నెలలో వేలం వేయనుంది.
డెవలప్ చేయకుండానే..
మేడిపల్లిలో లేఅవుట్ డెవలప్చేయకుండానే హెచ్ఎండీఏ ప్లాట్లను విక్రయిస్తోంది. డబ్బులు చెల్లించాక డెవలప్చేయనుంది. వేలంలో ప్లాట్లు పొంది, రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన 18 నెలల తర్వాత కొనుదారులకు ప్లాట్లను అప్పగించనుంది. దీనిపై కొనుగోలుదారులు మండిపడుతున్నారు. డబ్బులు కట్టి, రిజిస్ట్రేషన్ అయ్యాక కూడా ప్లాట్లు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. దీంతో చాలా ప్లాట్లను కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. డెవలప్ చేయక ముందే ఎందుకు విక్రయిస్తున్నారనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రీ లాంచ్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులు విక్రయాలు జరిపితే నేరం అయినప్పుడు, హెచ్ఎండీఏ చేస్తున్నది ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే ఓ దఫా వేలం పూర్తి
55 ఎకరాల్లో లేఅవుట్ చేయగా ఇప్పటికే ఓ దఫా వేలం పూర్తయింది. 50 ప్లాట్లని అమ్మకానికి పెట్టగా 32 ప్లాట్లు అమ్ముడుపోయాయి. రెండోసారి వేలం వేసేందుకు హెచ్ఎండీఏ సిద్ధమైంది. వచ్చేనెల 24, 25 తేదీల్లో 85 ప్లాట్లను విక్రయించడానికి రెడీ చేస్తోంది. 230 చదరపు గజాల నుంచి 643 చదరపు గజాల విస్తీర్ణంలో ప్లాట్లను విక్రయించనుండగా, చదరపు గజం అప్‌సెట్ ధర రూ.32 వేలుగా అధికారులు నిర్ణయించారు.
ఇదేనా దళితులకు భరోసా?
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల భూములు గుంజుకొని వారి నోట్లో మట్టి కొట్టింది. దళిత రైతులకు ప్లాట్లు కేటాయించకుండా హెచ్ఎండీఏ అధికారులు అనధికారికంగా ప్లాట్లు విక్రయిస్తూ మోసం చేస్తున్నారు. ముందుగా రైతులకు వెయ్యి గజాలు కేటాయించి తర్వాత విక్రయించాలి.
-తుంగతుర్తి రవి, పీర్జాదిగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు
ప్రీ లాంచ్ తరహాలో ఎందుకు?
ప్రీ లాంచ్ తరహాలో హెచ్ఎండీఏ ప్లాట్లు అమ్మడం ఎందుకు. ప్రైవేట్ వ్యక్తులు చేసేది నేరమైతే ఇది కూడా నేరమే కదా. కొనుగోలుదారులను తప్పుదారి పట్టించేలా ఈ లేఅవుట్ చేశారు. రైతులకు న్యాయం జరగలేదు. హెచ్ఎండీఏ మరోసారి ఆలోచించి, ముందు లేఅవుట్ ను డెవలప్ చేసి విక్రయించాలి.
-
ప్రవీణ్ కుమార్, తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్
వెయ్యి గజాలు ఇవ్వాలి
62 సర్వే నంబర్లో తీసుకున్న భూమిలో తమకు వెయ్యి గజాలు కేటాయించాలి. ఎలాంటి హామీ పత్రం ఇవ్వకుండా అధికారులు ముందుగా ప్లాటు అమ్ముకోవడం ఏమిటి. రైతులకు ఎటువైపు ప్లాట్ఇస్తారు, ఎంత ఇస్తారనే దానిపై క్లారిటీగా చెప్పాలి.
- పంగ మహేందర్, రైతు
భూములు ఇచ్చేదే లేదు
ఏండ్లుగా ఈ భూములను సాగు చేసుకుంటున్నాం. వీటిపై వచ్చిన ఆదాయంతో బతుకుతున్నం. అధికారులు వినకపోతేనే ఎస్సీ, ఎస్టీ కమిషన్కు వెళ్లాం. హైకోర్టులో పిటిషన్ వేశాం. కోర్టు భూములు తీసుకొవద్దని స్టే ఇచ్చింది. అవసరమైతే సుప్రీంకోర్డుకు వెళ్తాం. భూములను మాత్రం ఇవ్వం.
- బిజిలి కృష్ణ, రైతు