పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఎందుకీ యుద్ధం?

పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఎందుకీ యుద్ధం?

జెరూసలెం: మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్య పతనం తర్వాత.. పాలస్తీనాపై బ్రిటన్ పట్టు సాధించింది. ఇక్కడ మెజారిటీ జనం అరబ్బులు కాగా.. యూదులు మైనారిటీలు. పాలస్తీనాలో యూదులకు మాతృభూమిని ఏర్పాటు చేసే బాధ్యతను బ్రిటన్‌‌కు అంతర్జాతీయ సమాజం అప్పగించింది. దీంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. మరోవైపు 1920లలో, 1940లలో పాలస్తీనాకు భారీగా యూదులు తరలి వచ్చారు.

హాలోక్యాస్ట్ నేపథ్యంలో వారంతా హోమ్‌‌ ల్యాండ్‌‌ను కోరుకున్నారు. ఈ క్రమంలో యూదులు, అరబ్బుల మధ్య టెన్షన్స్ మరింత పెరిగాయి. దీంతో యూదులకు, అరబ్బులకు ప్రత్యేక దేశాలుగా పాలస్తీనా ప్రాంతాన్ని విభజించాలని ఐక్యరాజ్య సమితి సిఫారసు చేసింది. పవిత్ర జెరూసలేంను మాత్రం.. ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ కింద ఉంచాలని చెప్పింది. ఈ ప్రతిపాదనలకు యూదులు ఒప్పుకోగా.. అరబ్బులు వ్యతిరేకించారు. దీంతో యూఎన్ సూచనలు అమలు కాలేదు.
1948లో వెస్ట్ బ్యాంక్.. గాజా స్ట్రిప్ ఏర్పాటు!

తీవ్ర వ్యతిరేకత ఉండటం, పరిస్థితి చక్కదిద్దే పరిస్థితి లేకపోవడంతో 1948లో పాలస్తీనా నుంచి బ్రిటన్ వెళ్లిపోయింది. ఇదే అవకాశంగా భావించిన యూదులు.. ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. పాలస్తీనియన్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో యుద్ధం జరిగింది. ఈ సమయంలో లక్షల మంది పాలస్తీనియన్లు తమ ఇండ్లను వదిలి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఇజ్రాయెల్ పెద్ద మొత్తంలో  భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. 

జోర్డాన్, ఈజిప్ట్ వంటి అరబ్ దేశాలు పాలస్తీనా కోసం పోరాడాయి. జోర్డాన్ స్వాధీనం చేసుకున్న భూభాగానికి ‘వెస్ట్ బ్యాంక్’ అని, ఈజిప్టు అధీనంలోకి వచ్చిన ప్రాంతానికి ‘గాజా స్ట్రిప్’ అని పేరు పెట్టారు. జెరూసలెం పశ్చిమంవైపు ఇజ్రాయెల్ దళాలు, తూర్పు వైపు జోర్డానియన్ దళాలు పంచుకున్నాయి. 1967లో మళ్లీ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో తూర్పు జెరూసలేంతో పాటు వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌‌ను కూడా ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది.

 వెస్ట్ బ్యాంక్ ఇప్పటికీ ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. గాజా నుంచి మాత్రం 2005లో వైదొలిగింది. అప్పటి నుంచి హమాస్‌‌ అక్కడ అథారిటీగా కొనసాగుతున్నది.