కోమటిరెడ్డి బ్రదర్స్ vs గొంగిడి సునీత

కోమటిరెడ్డి బ్రదర్స్ vs గొంగిడి సునీత

యాదాద్రి, వెలుగు:

యాదగిరిగుట్టలో ఓ ఇండిపెండెంట్​ క్యాండిడేట్​ కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్​ లీడర్ల మధ్య పెద్ద లొల్లి జరిగింది. టీఆర్ఎస్​ ఎమ్మెల్యే గొంగిడి సునీత, కాంగ్రెస్​ లీడర్లు కోమటిరెడ్డి బ్రదర్స్​మధ్య మాటా మాటా పెరగ్గా.. ఇరు పార్టీల లీడర్లు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. దీంతో కొందరికి దెబ్బలు తగిలాయి.

ఎవరికీ మెజార్టీ రాక..

యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా ఏ పార్టీకీ మెజార్టీ రాలేదు. దాంతో కౌంటింగ్​ సెంటర్​ వద్దే ఇండిపెండెంట్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. ఇండిపెండెంట్​గా గెలిచిన కాటం రాజును టీఆర్ఎస్​లోకి చేర్చుకోవడానికి ఎమ్మెల్యే గొంగిడి సునీత, కాంగ్రెస్​లో చేర్చుకోవడానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కౌంటింగ్​ సెంటర్​ వద్దకు వచ్చారు. కొద్దిసేపటికే ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఎమ్మెల్యేలు సునీత, రాజగోపాల్​రెడ్డి, వెంకటరెడ్డి మధ్య మాటామాటా పెరిగింది. మీరెందుకు వచ్చారంటే.. మీరెందుకు వచ్చారంటూ నిలదీసుకున్నారు. రాజకీయ ఆరోపణలతో పాటు వ్యక్తిగత అంశాలపైనా విమర్శలు చేసుకున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్​ కార్యకర్తలు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేస్తూ కౌంటింగ్​ కేంద్రం రెండో గేటు వద్ద బైఠాయించారు. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించినా ఎవరూ వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇక తాను ఏ పార్టీలో చేరబోనని, ఇంటికెళ్లేందుకు ప్రొటెక్షన్​కావాలని ఇండిపెండెంట్​ కాటం రాజు పోలీసులను కోరారు. చివరికి టీఆర్ఎస్​ శిబిరంలో చేరారు. పోలీసులే దగ్గరుండి ఆయనను టీఆర్ఎస్​ నేతల కారులో ఎక్కించి పంపించారు.