అమర్​నాథ్‌‌ యాత్రపై వార్ ఎఫెక్ట్..ఫిట్​నెస్ సర్టిఫికెట్‌‌ కోసం ఒక్కరూ ‘గాంధీ’కి రాలే

అమర్​నాథ్‌‌ యాత్రపై వార్ ఎఫెక్ట్..ఫిట్​నెస్ సర్టిఫికెట్‌‌ కోసం ఒక్కరూ ‘గాంధీ’కి రాలే

పద్మారావునగర్, వెలుగు: అమర్​నాథ్‌‌ యాత్రపై వార్ ఎఫెక్ట్ పడింది. దేశ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అమర్​నాథ్​యాత్రకు భక్తులు వెనకడుగు వేస్తున్నారు. శుక్రవారం గాంధీ దవాఖానకు అమర్​నాథ్​యాత్ర మెడికల్​ఫిట్ నెస్​సర్టిఫికెట్ కోసం ఒక్కరు కూడా రాకపోవడం గమనార్హం. సికింద్రాబాద్‌‌ గాంధీ దవాఖానలో ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో  అమర్‌‌నాథ్‌‌కు వెళ్లే యాత్రికులకు పలు వైద్య పరీక్షలు నిర్వహించి ఫిజికల్‌‌ ఫిట్​నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారు. ఈ ఫిట్​నెస్‌‌ సర్టిఫికెట్‌‌ లేకుంటే అమర్‌‌నాథ్‌‌ క్షేత్ర సమీపంలోని చెకింగ్‌‌ పాయింట్ల వద్ద కేంద్ర భద్రతా బలగాలు యాత్రకు నిరాకరిస్తారు.

ఈ నేపథ్యంలో గత నెలలో ప్రభుత్వం వివిధ విభాగాల వైద్య అధికారులతో కూడిన బృందంతో గాంధీ దవాఖానలో ఫిట్​నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ప్రారంభించింది. అమర్‌‌నాథ్‌‌ ఫిట్​నెస్ సర్టిఫికెట్ల కోసం మొదట్లో క్యూ కట్టిన యాత్రికులు పాకిస్తాన్‌‌ యుద్ధ భయంతో క్రమంగా తగ్గుతూ వచ్చారు. ఈ నెల 7న బుధవారం కేవలం ఆరుగురు యాత్రికులు మాత్రమే దరఖాస్తు చేసుకోగా, ఒక్కరు కూడా మెడికల్ సర్టిఫికెట్​కోసం రాలేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే మెడికల్​ఫిట్​నెస్​సర్టిఫికెట్లు తీసుకున్నవారు కూడా అమర్​నాథ్​యాత్ర వెళ్లడానికి వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.