టీఆర్​ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

టీఆర్​ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
  • అడ్డుకుంటామన్న తెలంగాణ ఆల్‌‌ వర్సిటీ స్టూడెంట్‌‌ జేఏసీ, కమ్యూనిస్టులు
  • సీపీఐ, సీపీఎం సెక్రటరీలతో ఫోన్‌‌లో మాట్లాడిన కేసీఆర్‌‌?
  • విభజన హామీలపై బుద్ధిజీవుల పేరుతో మోడీకి బహిరంగ లేఖ
  • కార్యక్రమానికి సీఎం కేసీఆర్​ను ఎందుకు ఆహ్వానించలేదు: టీఆర్​ఎస్​

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రధాని మోడీ రామగుండం పర్యటన చుట్టూ రాజకీయ దుమారం చెలరేగుతున్నది. ఆయన టూర్​ను అడ్డుకుని తీరుతామని తెలంగాణ ఆల్‌‌ యూనివర్సిటీ స్టూడెంట్‌‌ జేఏసీ, కమ్యూనిస్టు పార్టీలు హెచ్చరించాయి. విభజన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రధానిని ప్రశ్నిస్తూ బుద్ధిజీవుల పేరుతో బహిరంగ లేఖను రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు రిలీజ్‌‌ చేశాయి. ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్‌‌ఎస్‌‌ చీఫ్‌‌, సీఎం కేసీఆర్‌‌ సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులకు ఫోన్‌‌ చేసి మాట్లాడినట్టు తెలిసింది.  ప్రధాని కార్యక్రమానికి సీఎం కేసీఆర్​ను ఆహ్వానించ లేదని, ఇదేం పద్ధతి అని టీఆర్​ఎస్​ నేతలు దుయ్యబట్టారు. టీఆర్​ఎస్​ నేతల తీరును కేంద్రం తప్పుబట్టింది. ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి రావాలని సీఎం కేసీఆర్​కు ఈ నెల 2ననే ఆహ్వాన లేఖ పంపినట్లు తెలిపింది. ప్రధాని మోడీ గతంలో మూడుసార్లు రాష్ట్ర పర్యటనకు వస్తే ఆయనకు సీఎం కేసీఆర్​ కనీసం స్వాగతం పలుకలేదని, ఇప్పుడేమో కేంద్రం తమకు సమాచారం ఇవ్వలేదనడం ఏమిటని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ప్రధాని పర్యటనలో ఆటంకాలు సృష్టించేందుకు కేసీఆర్​ కుట్ర చేస్తున్నారని, కమ్యూనిస్టులను కావాలని రెచ్చగొడుతున్నారని వారు మండిపడ్డారు. 

అగ్నిగుండం చేస్తామన్న వర్సిటీ స్టూడెంట్‌‌‌‌ జేఏసీ

ప్రధాని మోడీ ఈ నెల 12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రీ ఓపెన్​ కోసం రానున్నారు. అయితే.. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని, ఒక్క గుజరాత్‌‌‌‌కే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ఆల్‌‌‌‌ యూనివర్సిటీ స్టూడెంట్‌‌‌‌ జేఏసీ ఆరోపిస్తున్నది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ ఆ హామీ నెరవ్చేలేదని, ‘యూనివర్సిటీ కామన్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు’ ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే, కేంద్రం ఆదేశాలతోనే గవర్నర్‌‌‌‌ ఆ బిల్లును తొక్కి పెట్టారని దుయ్యబడుతున్నది. తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్న మోడీ రామగుండం టూర్‌‌‌‌ను అగ్నిగుండం చేస్తామని ప్రకటించింది. ఈ ప్రకటనను ప్రగతి భవన్‌‌‌‌కు సన్నిహితంగా ఉండే లీడర్లే రిలీజ్‌‌‌‌ చేశారు.

కమ్యూనిస్టు లీడర్లతో కేసీఆర్‌‌‌‌ చర్చలు?

మోడీ టూర్‌‌‌‌ను అడ్డుకోవడంపై ఉమ్మడి ఆందోళనలు చేద్దామని సీపీఐ, సీపీఎం సెక్రటరీలు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రంతో కేసీఆర్ చర్చలు జరిపినట్టు తెలిసింది. కేసీఆర్ ప్రతినిధులుగా ప్రభుత్వ విప్‌‌‌‌ ఒకరు, గతంలో సీపీఎంలో పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న మరో కీలకనేత కమ్యూనిస్టులతో చర్చలు జరిపినట్టు సమాచారం. మోడీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, అలాంటి వ్యక్తి పర్యటనను అడ్డుకునేందుకు తమతో కలిసి రావాలని కోరగా.. కమ్యూనిస్టులు అంగీకరించిన ట్టు తెలిసింది. దీంతో కమ్యూనిస్ట్‌‌‌‌ పార్టీలతో పాటు వాటి అనుబంధ సంఘాలు ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన ఇచ్చినట్లు సమాచారం. 

తెలంగాణ బుద్ధిజీవుల పేరిట బహిరంగలేఖ

తెలంగాణ ఏర్పడి 8 ఏండ్లు అవుతున్నా విభజన హామీలు నెరవేర్చలేదని తెలంగాణ బుద్ధిజీవుల పేరుతో బుధవారం ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. కాజీపేట కోచ్‌‌‌‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌‌‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదని, సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ పార్క్‌‌‌‌, మెడికల్‌‌‌‌ కాలేజీ, కేంద్ర విద్యాసంస్థలు, నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదని ఆక్షేపించారు. దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లిందని, దళితులపై దాడులు పెరిగాయని, ప్రజల వేషభాషల పట్ల ఏకపక్ష నిర్ణయాలు అమలు చేస్తూ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోయాయని, రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం వాటిని వాడుకోవాలని  చూస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే రామగుండం పర్యటనలో రాష్ట్రానికి ఏమి ఇస్తారో చెప్పాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఈ లేఖలో 64 మంది సెంట్రల్‌‌‌‌ వర్సిటీ, ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, బీఆర్‌‌‌‌ అంబేద్కర్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ యూనివర్సిటీల రిటైర్డ్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌లు, ప్రొఫెసర్‌‌‌‌లు, సోషల్‌‌‌‌ యాక్టివిస్టులు, కవులు, రచయితలు, దళిత రచయితల పేర్లు రాశారు. ఈ లేఖను ప్రభుత్వ విప్‌‌‌‌ ఒకరు మీడియాకు రిలీజ్‌‌‌‌ చేశారు. తెలంగాణ ప్రజల హక్కుల ఐక్య కార్యాచరణ కమిటీ మరో బహిరంగ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణపై మోడీ కక్షకట్టారని, వివక్ష చూపుతున్నారని ఈ ప్రకటనలో మండిపడ్డారు. కాగా, దేశంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధే ప్రధాని మోడీ లక్ష్యమని, అభివృద్ధి పనులకు హాజరయ్యేందుకు రాష్ట్రానికి వస్తున్న ప్రధానిని అడ్డుకుంటామనడం అర్థరహితమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌ అన్నారు. 

ప్రధాని ప్రొటోకాల్‌‌‌‌ పాటించడం లేదు: వినోద్‌‌‌‌

ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రొటోకాల్‌‌‌‌ పాటించడం లేదని ప్లానింగ్‌‌‌‌ బోర్డు వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వినోద్‌‌‌‌ కుమార్‌‌‌‌ మండిపడ్డారు. రాజకీయ కోణంలోనే ప్రధాని రామగుండం వస్తున్నారన్నారు. ఏడాది క్రితమే అక్కడ ఎరువుల ఉత్పత్తి ప్రారంభమైనా ఇప్పుడు దాన్ని ప్రధాని జాతికి అంకితం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘‘ప్రధాని రావడం సంతోషమే కానీ ఈ కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వంతో, సీఎంతో సంప్రదించాలన్న కనీస పద్ధతులను పీఎంవో అనుసరించలేదు. ప్రధాని తెలంగాణ పర్యటనలో కేసీఆర్‌‌‌‌ను కావాలనే నిరోధిస్తున్నరు ” అని వినోద్ దుయ్యబట్టారు. కరోనా టైమ్​లో భారత్‌‌‌‌ బయోటెక్‌‌‌‌ లో వ్యాక్సిన్‌‌‌‌ పరిశీలనకు వచ్చినప్పుడు కేసీఆర్‌‌‌‌ను నిరోధించారని, మోడీ టూర్‌‌‌‌కు కేసీఆర్‌‌‌‌ కావాలనే దూరంగా ఉన్నారంటూ కొంతమంది సోషల్‌‌‌‌ మీడియాలో పనిగట్టుకొని  ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా రామగుండం-భూపాలపల్లి-మణుగూరు రైల్వే లైన్‌‌‌‌ ప్రకటించాలని, భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్‌‌‌‌ను అదేరోజు జాతికి అంకితం చేయాలని వినోద్​ డిమాండ్‌‌‌‌ చేశారు.

మూడుసార్లు ప్రధాని వచ్చినా కేసీఆర్‌‌‌‌ పోలే

ప్రధాని రామగుండం పర్యటనకు కేసీఆర్‌‌‌‌ను దూరం పెట్టారని ప్రభుత్వవర్గాలు ఆక్షేపిస్తున్నాయి. కానీ ఇంతకు ముందు మూడుసార్లు ప్రధాని మోడీ హైదరాబాద్‌‌‌‌కు వస్తే ఆయనకు స్వాగతం పలకడానికి కూడా కేసీఆర్ వెళ్లలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న ముచ్చింతల్‌‌‌‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని వచ్చారు. జ్వరం కారణంగా కేసీఆర్‌‌‌‌ ప్రధానికి స్వాగతం పలికేందుకు ఎయిర్‌‌‌‌ పోర్టుకు వెళ్లలేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. మే 26న ఐఎస్‌‌‌‌బీ 20వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌‌‌‌కు రాగా.. ఆయన ఇక్కడికి రాకముందే కేసీఆర్‌‌‌‌ ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లారు. మోడీ హైదరాబాద్‌‌‌‌ నుంచి వెళ్లిపోయిన తర్వాతే హైదరాబాద్‌‌‌‌కు తిరిగి వచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు మోడీ హైదరాబాద్‌‌‌‌కు వచ్చినప్పుడు కేసీఆర్‌‌‌‌ స్వాగతం పలుకలేదు. ప్రధాని ప్రైవేటు కార్యక్రమానికి వస్తే సీఎం ఎందుకు వెళ్లాలని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు ఎదురు ప్రశ్నించారు. మోడీ హైదరాబాద్‌‌‌‌కు వచ్చిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌‌‌‌ యాదవ్‌‌‌‌  స్వాగతం పలికారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో ఆయనను కలిసి అభివృద్ధికి సంక్షేమ అంశాలపై చర్చించాల్సిన సీఎం కేసీఆర్‌‌‌‌.. ముఖం చాటేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది అనేక పర్యాయాలు ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌‌‌‌ ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసేందుకు కనీసం ప్రయత్నించలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.