ఇరాన్ యుద్ధంతో ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్.. గల్ఫ్ దేశాలకు డ్రోన్ టెక్నాలజీ అమ్మకం

ఇరాన్ యుద్ధంతో ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్.. గల్ఫ్ దేశాలకు డ్రోన్ టెక్నాలజీ అమ్మకం

ఖతార్ నుంచి కువైట్ వరకు, సౌదీ అరేబియా నుంచి యూఏఈ వరకు ప్రస్తుతం ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ వణికిపోతోంది. ఇరాన్ దాడుల భయంతో గల్ఫ్ దేశాలు తలలు పట్టుకుంటుంటే.. సరిగ్గా ఇదే అదనుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమారుడు ఈ పరిస్థితులను క్యాష్ చేసుకునేందుకు బిజినెస్ స్టార్ట్ చేశారు. యుద్ధం ఒకపక్క వినాశనాన్ని కలిగిస్తుంటే.. మరోపక్క అది ట్రంప్ వారసులకు మాత్రం భారీ లాభాలను తెచ్చిపెట్టే బంగారు బాతుగా మారింది. తాజాగా ఫ్లోరిడాకు చెందిన 'పవర్‌అస్' అనే డ్రోన్ స్టార్టప్‌లో ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌లు చేరడం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు తెరలేపింది.

నిజానికి మధ్యప్రాచ్యంలో ప్రస్తుత ఉద్రిక్తతలకు అమెరికా, ఇజ్రాయెల్ దాడులే కారణం. కమాండర్ ఇన్ చీఫ్‌గా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ ప్రాంతంలో అలజడి మెుదలవగా దాని నుంచి తన దేశాలను కాపాడుకోవడానికి గల్ఫ్ దేశాలు రక్షణ కవచాల కోసం వెతుకుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలోనే ట్రంప్ కుమారులు తమ డ్రోన్ ఇంటర్‌సెప్టర్ టెక్నాలజీని గల్ఫ్ దేశాలకు అమ్ముకుని సొమ్ము చేసుకోవటానికి సిద్ధమయ్యారు. తాము ప్రాణాలను కాపాడే అద్భుతమైన సాంకేతికతను అందిస్తున్నాం అని కంపెనీ కో-ఫౌండర్ బ్రెట్ వెలికోవిచ్ చెబుతున్నప్పటికీ.. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం రాజకీయ పరపతిని అడ్డం పెట్టుకుని లాభాలు గడించడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి.

రాజకీయ నైతికతను పక్కన పెట్టి, ఏకంగా అధ్యక్షుడు ట్రంప్ వారసులు యుద్ధం పేరుతో వ్యాపారం చేయడంపై అమెరికాలో నిరసనలు వ్యక్తమౌతున్నాయి. మాజీ వైట్ హౌస్ ఎథిక్స్ లాయర్ రిచర్డ్ పెయింటర్ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అధ్యక్షుడికి నచ్చిన పనులు చేయించుకోవడానికి గల్ఫ్ దేశాలు ఆయన కుమారుల నుంచి ఆయుధాలు కొనాల్సిన ఒత్తిడికి లోనవుతాయని చెప్పారు. అంటే ఒక రకంగా కాంగ్రెస్ అనుమతి లేకుండా జరుగుతున్న యుద్ధం నుంచి ట్రంప్ ఫ్యామిలీ భారీగా సొమ్ము చేసుకుంటోందని రిచర్డ్ పెయింటర్ ఆరోపించారు.

పవర్‌అస్ డ్రోన్ స్టార్టప్ కంపెనీ సుమారు 1.1 బిలియన్ డాలర్ల పెంటగాన్ నిధులపై కూడా కన్నేసింది. చైనా డ్రోన్లపై నిషేధం విధించిన వేళ.. అమెరికా స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తోంది. రియల్ ఎస్టేట్, క్రిప్టోకరెన్సీల నుంచి ఇప్పుడు ఏకంగా ఆయుధ తయారీ రంగంలోకి ట్రంప్ ఫ్యామిలీ అడుగుపెట్టడం వారి వ్యాపార సామ్రాజ్య విస్తరణలో ఒక వ్యూహాత్మక మార్పుగా కనిపిస్తోంది. పవర్‌అస్ కంపెనీ ఇప్పటికే 60 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. నాస్డాక్ లిస్టెడ్ కంపెనీతో విలీనం ద్వారా పబ్లిక్‌లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. దేశభక్తి, రక్షణ అనే ముసుగులో జరుగుతున్న ఈ భారీ వ్యాపార డీల్.. భవిష్యత్తులో అమెరికాలో మరిన్ని రాజకీయ వివాదాలకు కేంద్రబిందువు కానుందని నిపుణులు అంటున్నారు.