- పంద్రాగస్టు సందర్భంగా నేటి నుంచి ప్రజలకు అనుమతి
- ఫండ్స్, మెయింటెనెన్స్ లేక డంపింగ్ యార్డ్‌లా మారిన పార్క్
- రూ.6.20 కోట్ల కుడా నిధులతో పూర్తయిన పనులు
వరంగల్, వెలుగు: వరంగల్ కాకతీయ మ్యూజికల్ గార్డెన్ 20 ఏండ్ల తరువాత మళ్లీ అందుబాటులోకి రానుంది. ఏండ్లుగా మూలకుపడిన గార్డెన్లో అభివృద్ధి పనులు చేపట్టగా..ఈ నెల 10న ఉమ్మడి వరంగల్ ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దీనిని పున: ప్రారంభించారు. శుక్రవారం రాత్రి రిహర్సల్స్ నిర్వహించారు. శనివారం నుంచి నగర ప్రజలకు మ్యూజికల్ గార్డెన్ కనువిందు చేయనుంది.
కేంద్రం నిధులిచ్చినా..!
ఉమ్మడి ఏపీలో 1995 నవంబర్ 27న అప్పటి సీఎం చంద్రబాబు ఈ పార్కును ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్, తిరుపతి, వైజాగ్‌లో మాత్రమే అందుబాటులో ఉండే ఇలాంటి మ్యూజికల్ గార్డెన్తో వరంగల్ సిటీకి ఎంతో లుక్ వచ్చింది. రంగురంగుల పూల చెట్లు, స్నూకర్ బోర్డ్ మాదిరి పచ్చని గడ్డి, అందమైన కళాఖండాలతో కలర్ఫుల్గా ఉండేది. సౌండ్ బాక్సుల్లో వచ్చే మ్యూజిక్కు అనుగుణంగా వాటర్ ఫౌంటేన్ల డాన్స్ ఉండేది. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వేలాది మంది మ్యూజికల్గార్డెన్ సందర్శించేందుకు వచ్చేవారు. సినిమా, టీవీ షూటింగులు జరిగేవి. అయితే 2005 తరువాత పార్క్ నిర్వహణను గాలికొదిలేశారు. కనీస మెయింటెనెన్స్ లేక పార్కులోని వాటర్ ఫౌంటేన్లు, మోటార్లు ఒక్కొక్కటిగా తుప్పుపట్టాయి.
పిల్లల ఆట వస్తువులు, జనాలు కూర్చునే కుర్చీలు విరిగిపోయాయి. కళాఖండాలు కళతప్పాయి. పిచ్చిచెట్లతో పార్కు లోపలి భాగం అడవిని తలపించింది. బోటింగ్ ప్రాంతమంతా మురుగుకుంటలా తయారైంది. మ్యూజిక్ డాన్స్ లేకుండానే నెట్టుకొచ్చిన అధికారులు ఆపై గార్డెన్‌ను పూర్తిగా మూసేశారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరీంనగర్ ఉజ్వల పార్కు తరహాలో అభివృద్ధి చేసి పర్యాటకులు బస చేసేలా హరిత హోటల్ ఆధ్వర్యంలో గదులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం వరంగల్ నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చి మ్యూజికల్ గార్డెన్ అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించింది. అయినప్పటికీ గులాబీ లీడర్ల ఫెయిల్యూర్‌తో పార్క్ పున:ప్రారంభానికి నోచుకోలేదు.
ప్రస్తుత ఎమ్మెల్యేల ప్రత్యేక చొరవతో..
20 ఏండ్ల కింద మూలకుపడ్డ మ్యూజికల్ గార్డెన్ పున:ప్రారంభం విషయంలో గ్రేటర్ వరంగల్ ఎమ్మెల్యేలు కొండా సురేఖ, నాయిని రాజేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మధ్యలో ఆగిన పనులను స్పీడప్ చేసేందుకు కుడా నుంచి రూ.6.20 కోట్లు కేటాయించడంతో పనులు ముందుకెళ్లాయి. ఈ నెల 10న జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పొంగులేటి పున:ప్రారంభించారు. శనివారం నుంచి ఈ గార్డెన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఉదయం 6 గంటల నుంచి 9 వరకు వాకర్స్‌కు.. 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉండనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యూజికల్ షో నిర్వహిస్తారు.
