అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్య విద్యార్థుల ఆందోళనలు

అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్య విద్యార్థుల ఆందోళనలు

వరంగల్ : వరంగల్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్య విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. నాలుగు రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విద్యార్థులు హాస్పిటల్ గేట్లకు తాళాలు వేసి, రోడ్డుపై బైఠాయించారు. ఆయూష్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు పునరుద్దరించే వరకూ ఆందోళనలు విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. 

అంతకుముందు.. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. వరంగల్ లోని అనంతలక్ష్మీ ఆయుర్వేద కాలేజీ విద్యార్థులు నిన్న కూడా నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న కాలేజీలో మౌలిక వసతులు కల్పించాలని, సీట్లను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ... వెంకట్రామా జంక్షన్ నుంచి ఎంజీఎం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడే రోడ్డుపై బైఠాయించారు. కాలేజీలో 67 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలని, కేవలం 23 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. కాలేజీని ఇన్ చార్జి ప్రిన్సిపాల్ నడిపిస్తున్నారని, అవసరమైన బుక్స్ లేవని ఆరోపించారు. విద్యార్థులకు బాత్రూమ్ లు కూడా సరిగా లేవన్నారు. పూర్తిస్థాయి ఫ్యాకల్టీ, వసతులు ఉంటేనే అడ్మిషన్స్ కు పర్మిషన్ ఇస్తామని కేంద్ర ఆయూష్ శాఖ గతంలో చెప్పిందని, వెంటనే వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.