వరంగల్ డంపింగ్ యార్డుకు నిప్పు అంటుకుందా.. అంటించారా?

 వరంగల్ డంపింగ్ యార్డుకు నిప్పు  అంటుకుందా..  అంటించారా?
  • యార్డులో ఎగిసిపడ్తున్న మంటలు... ట్రై సిటీని కమ్మేసిన పొగ
  • ఆర్పేందుకు రాత్రి, పగలు కష్టపడుతున్న ఫైర్, డీఆర్ఎఫ్ సిబ్బంది
  • గతేడాది డిసెంబర్ వరకే పూర్తి కావాల్సిన బయో మైనింగ్
  • రీ సైక్లింగ్ చేయలేక కావాలనే నిప్పంటించారని అనుమానాలు

వరంగల్‍, వెలుగు : గ్రేటర్ వరంగల్‍ కు చెందిన మడికొండ డంపింగ్ యార్డు అంటుకున్నది. మంటలు ఎగిసిపడ్తుండడంతో ట్రైసిటీస్ ని పొగ కమ్మేస్తోంది. దీంతో చుట్టుపక్కల రెండు, మూడు కిలోమీటర్ల పరిధిలో జనం ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫైర్‍ సిబ్బంది, డీఆర్‍ఎఫ్‍ బృందాలు నాలుగైదు రోజులుగా రాత్రింబవళ్లు మంటలు ఆర్పేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావడం లేదు. పైగా పొగ, దుర్వాసనతో ఇప్పటికే పలువురు ఫైర్‍ సిబ్బంది అస్వస్థతతో ఆసుపత్రిపాలయ్యారు. మడికొండ డంపింగ్​యార్డులో చెత్త బయోమైనింగ్​కోసం కోయంబత్తూర్​కు చెందిన లీప్ ఎకో టెక్ సొల్యూషన్స్​అనే​ కంపెనీకి రూ.37 కోట్లకు బల్దియా లీజుకిచ్చింది. కానీ ఇన్​టైంలో చెత్తను ప్రాసెసింగ్ చేయలేక కాంట్రాక్ట్​ సంస్థే చెత్తకు నిప్పు పెట్టిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.  

బయో మైనింగ్ జరుగుతలే...

గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలో 66 డివిజన్లు ఉండగా 2.50 లక్షల ఇండ్లున్నాయి. నగరంలో ప్రతిరోజూ 300 నుంచి 350 టన్నుల చెత్త పోగవుతోంది. ఈ చెత్తను డంప్ చేసేందుకు మడికొండ , రాంపూర్ గ్రామాల సమీపంలోని 33 ఎకరాల స్థలంలో 2013లో యార్డును ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు లక్షల టన్నుల చెత్త పోగయింది. దీని నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండడంతో మడికొండ, రాంపూర్ గ్రామాల ప్రజలతో పాటు, ధర్మసాగర్‍, ఎలుకుర్తి, పెద్ద పెండ్యాల, తరాలపల్లి, టేకులగూడెం, భట్టుపల్లి, రాంపేట, అయోధ్య పురం, రాంపేట, కుమ్మరిగూడెం, కాజీపేట ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో 3 లక్షల టన్నుల చెత్తను బయో మైనింగ్‍ చేసేందుకు 2021లో పనులు ప్రారంభించారు. కానీ ఇప్పటివరకు పనులు సగం కూడా పూర్తి కాలేదు. 

వారం రోజులుగా మంటలు, పొగ

డంపింగ్ యార్డులో బయో మైనింగ్ ఆగిపోవడం, మరో  వైపు ప్రతి రోజు టన్నుల కొద్దీ చెత్త యార్డుకు వస్తుండడంతో  గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. వారం కింద యార్డులో చెత్తకు నిప్పంటుకొని మిగతా చోట్లకూ పాకింది. యార్డులో సుమారు 5 లక్షల టన్నుల చెత్త ఉండటంతో మంటలు భారీ ఎత్తున లేచాయి. రెండు, మూడు కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. చుట్టుపక్కల గ్రామాల జనాలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్‍ ద్వారా విషయాన్ని గ్రేటర్‍ ఆఫీసర్ల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఫైర్‍ సిబ్బంది యార్డు వద్దకు చేరుకొని ఐదారు రోజులుగా పగలు, రాత్రి తేడా లేకుండా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పొగ కారణంగా ఫైర్ సిబ్బంది సైతం అస్వస్థతకు గురవుతున్నారు. మంటలు ఆర్పేందుకు డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం సహకరిస్తున్నారు. 

ప్రమాదమా.. కావాలని నిప్పంటించారా ?

మడికొండ డంపింగ్ యార్డులో చెత్తకు నిప్పంటుకోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చెత్తను మైనింగ్ చేయాల్సిన సంస్థ 2021 డిసెంబర్‍ లో పనులు ప్రారంభించి 2022 డిసెంబర్ వరకు 3 లక్షల టన్నుల చెత్తను బయో మైనింగ్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు సగం కూడా పూర్తికాలేదు. ఇదే టైంలో చెత్తకు నిప్పంటుకోవడంతో బయో మైనింగ్ చేయలేక కాంట్రాక్ట్ సంస్థే నిప్పు పెట్టిందా ? లేక నిజంగానే ప్రమాదం జరిగిందా ? అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

జులై నాటికి బయోమైనింగ్ కంప్లీట్ చేస్తం 

మడికొండ డంపింగ్‍ యార్డులో వారం కింద చెత్తకు నిప్పంటుకుంది. ఫైర్‍, డీఆర్‍ఎఫ్‍ బృందాలు పగలు, రాత్రి పనిచేసి మంటలను ఆర్పుతున్నారు. బయోమైనింగ్ స్పీడ్ గా జరిగేలా చర్యలు తీసుకుంటాం. 3 లక్షల టన్నులు రీసైక్లింగ్‍ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1.5 లక్షల టన్నులు పూర్తైంది. ప్రస్తుతం రోజుకు 1600 టన్నుల చెత్త ప్రాసెసింగ్‍ అవుతోంది. జులై నాటికి పనులు పూర్తయ్యేలా చూస్తాం.
- రిజ్వాన్‍ బాషా, గ్రేటర్‍ కమిషనర్‍