చిన్న తప్పుచేసినా ఓటు చెల్లదు.. ఎమ్మెల్సీ ఓటు వేసేదిలా..

చిన్న తప్పుచేసినా ఓటు చెల్లదు.. ఎమ్మెల్సీ ఓటు వేసేదిలా..
  •     పార్టీ గుర్తు లేకుండానే ఎన్నికలు
  •     అభ్యర్థి పేరు పక్కన బాక్స్​ లో నంబర్​ మాత్రమే వేయాలి
  •     గత ఎన్నికల్లో 20వేలకు పైగా చెల్లని ఓట్లు

ఖమ్మం, వెలుగు:  వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం కానుంది. ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉండగా, 4,61,806 మంది గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకున్నారు. సాధారణ ఎన్నికలకు, ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఓటింగ్ విధానంలో తేడా ఉంటుంది. 

ఇతర ఎన్నికల తరహాలో ఈ ఎలక్షన్లలో పార్టీ సింబల్ ​ఉండదు. ఈవీఎంలు కాకుండా కేవలం బ్యాలెట్ పేపర్ మీదనే ఎలక్షన్​ జరుగుతుంది. బ్యాలెట్ పేపర్​ లో క్రమసంఖ్య, అభ్యర్థి పేరు, అభ్యర్థి ఫొటో మాత్రమే ఉంటాయి. దాని పక్కన ఉండే బాక్సులో అభ్యర్థికి ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది. ఓటింగ్ సమయంలో చిన్న పొరపాటు చేసినా ఓటు చెల్లకుండా పోయే ప్రమాదం ఉంటుంది. 2021లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20వేలకు పైగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. అభ్యర్థుల గెలుపోటముల్లో చెల్లని ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. 
చేయాల్సినవి..


అభ్యర్థి పేరు, ఫొటో పక్కన ఉన్న బాక్సులో కేవలం ఇంగ్లీష్ నంబర్​ మాత్రమే వేయాలి. ఒకటో ప్రాధాన్యత ఓటు వేయకుండా 2, 3 ఇతర ఏ నంబర్లు వేసినా ఆ ఓటు చెల్లుబాటు కాదు. 

పోలింగ్ బూత్​లో అధికారులు ఇచ్చిన పెన్​ తో మాత్రమే బ్యాలెట్ పేపర్ పై ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయాలి. సొంత పెన్ను వాడినా, ఇతర రంగులు పడినా ఓటు చెల్లదు. 

ఒక ప్రాధాన్యతను ఒకరికే వేయాల్సి ఉంటుంది. అంటే ఒకటో నంబర్ ను ఒకరికి మాత్రమే వేయాలి. ఆ తర్వాత రెండో నంబర్​ ను ఒకరికి, మూడో నంబర్​ ను మరొకరికి మాత్రమే వేయొచ్చు. 

బ్యాలెట్ పేపర్​ పై అభ్యర్థి పేరు పక్కన కేవలం ఇంగ్లీష్​ నంబర్ 1, 2, 3, 4, 5 అని​ మాత్రమే వేయాలి. ఒకటి అని తెలుగులో గానీ, వన్​ అని ఇంగ్లీష్​ లో గానీ రాయకూడదు. 


ఇంగ్లీష్​ నంబర్లలో కాకుండా, రోమన్​ నంబర్లలో కూడా ప్రాధాన్యత ఓటు వేయొచ్చు. అయితే ఏదైనా ఒక విధానంలో మాత్రమే నంబర్లు వేయాలి. 

ప్రాధాన్యత క్రమంలోనే ఓటు వేయాలి. ఒకరికి ఒకటో ప్రాధాన్యత ఓటు వేసిన తర్వాత రెండో ప్రాధాన్యత వేయకుండా, మూడో ప్రాధాన్యత ఓటేస్తే అది చెల్లదు. అందుకని ఎంత మందికి ఓటేసినా ప్రాధాన్యత క్రమాన్ని చూసుకొని వేయాలి. 

బ్యాలెట్ పేపర్​ పై నంబర్​ తప్పించి టిక్​ మార్క్​ పెట్టినా, పేరు రాయడం గానీ, ఇతర ఏ గుర్తులు ఉన్నా వాటిని చెల్లని ఓటుగానే పరిగణిస్తారు. 

ఇద్దరు అభ్యర్థులకు మధ్యలో సంఖ్య వేసినా చెల్లదు.

అభ్యర్థులు ఎంత మంది ఉంటే అందరికీ ఓటు వేయాల్సిన పనిలేదు. ప్రాధాన్యతక్రమంలో నచ్చిన కొందరికి ఓటేస్తే సరిపోతుంది. 

ఒక అభ్యర్థికి ఒక ప్రాధాన్యత ఓటు వేసిన తర్వాత దిద్దుబాట్లు గానీ, కొట్టివేయడం గానీ  చేయకూడదు. 

ఏ విధమైన అంకె వేయకుండా ఇచ్చిన బ్యాలెట్ పేపర్​ కూడా చెల్లుబాటు కాదు. 

ఎక్కువ ప్రాధాన్యతలు ఇవ్వడం ఇష్టం లేకపోతే.. కేవలం ఒకరు మాత్రమే ఆ పదవికి అర్హులు అనుకుంటే ఆ ఒక్కరికి మాత్రమే ఓటు వేసి మిగిలిన టూ, త్రీ ఇవ్వకుండా వదిలేయవచ్చు. 

ఒకే వ్యక్తికి రెండు ఓట్లు వేసినా చెల్లదు. ఒకటే నంబర్ ఇద్దరికి వేసినా చెల్లదు.

ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్​ ను బాక్స్​ లో వేయకుండా తీసుకెళ్తే కేసు నమోదు చేస్తారు. 

గత ఎమ్మెల్సీ ఎన్నికలో చెల్లని ఓట్లు ఎక్కువే... 

గతంలో జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలోనే చెల్లని ఓట్లు నమోదయ్యాయి. డిగ్రీ పూర్తి చేసుకున్న వారు, టీచర్లు, ఇతర ఉద్యోగులుగా పనిచేస్తున్న వారే చెల్లని ఓట్లు వేస్తుండడంతో ఓటింగ్ ప్రక్రియపై వారికి అవగాహన లేదని అర్థమవుతోంది. 2021లో జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20వేలకు పైగా చెల్లని ఓట్లు నమోదు కాగా, హైదరాబాద్, మహబూబ్​నగర్, రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 21 వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. దీంతో అధికారులు కూడా ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలింగ్ బూత్​ లో కూడా ఓటే వేసే సమయంలో చేయాల్సినవి, చేయకూడని అంశాలతో పోస్టర్లను అంటించనున్నారు.