- వరంగల్ ఎంపీ కడియం కావ్య
స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్ఐఆర్ పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని, దీని ద్వారా అక్రమ పద్ధతుల్లో కాంగ్రెస్ ఓట్లను తొలగించి లబ్ధి పొందాలని చూస్తోందని వరంగల్ ఎంపీ కడియం కావ్య ధ్వజమెత్తారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని పల్లగుట్టలో అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో ఎంపీ మాట్లాడారు. కేంద్రం అమలు చేయాలని చూస్తున్న 'ఎస్ఐఆర్' విధానాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ రంగాన్ని పటిష్టం చేసి, నిరంతర సరఫరాతో వెలుగులు నింపిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎఫ్ సీఐ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర నిందలు వేయడం మానేసి వెంటనే ధాన్యాన్ని సేకరించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సీజన్లో నియోజకవర్గంలో రికార్డుస్థాయిలో పంటలు పండాయని తెలిపారు. నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎమ్మెల్యే కోరారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీతో పాటు పలు గ్రామాల్లో ప్రజలు నివాసముంటున్న ఇండ్ల మీదుగా వెళ్లిన ప్రమాదకరమైన 13 కేవీ విద్యుత్ లైన్లను వెంటనే తొలగించాలని కోరారు. రఘునాథపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను 132 కేవీ సామర్థ్యం నుంచి 220 కేవీకి అప్‌గ్రేడ్ చేయాలని, దీనివల్ల జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతుందని వివరించారు.
