- గ్రేటర్ లో గతంలో అక్రమ మైనింగ్ బారినపడి పనికిరాకుండా పోయిన సర్కారు స్థలాలు
- భద్రకాళి చెరువు పూడిక మట్టితో చదును చేస్తున్న 'కుడా'
- నగర అభివృద్ధి పనులకు ఉపయోగపడేలా ప్రణాళిక
- ఇప్పటికే సుమారు 23 ఎకరాలకుపైగా రీ క్లయిమ్
హనుమకొండ, వెలుగు: వరంగల్ మహానగరంలో ప్రభుత్వ ప్రాజెక్టులకు స్థలాలు దొరకని పరిస్థితి నెలకొంది. గ్రేటర్ సిటీలో అందుబాటులో ఉన్న కొన్ని సర్కారు భూములను గత ప్రభుత్వ హయాంలో కొందరు ఇల్లీగల్ మైనింగ్ తో కొల్లగొట్టి బొందలుగా మార్చగా, ఇప్పుడు ఆ స్థలాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఆయా స్థలాలను తిరిగి వినియోగంలోకి తెచ్చేలా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ప్లాన్ చేసింది. నగరంలోని భద్రకాళి చెరువు పూడిక మట్టితో గోతులన్నీ పూడ్చేసి ప్రభుత్వ ప్రాజెక్టులకు ఉపయోగపడేలా డెవలప్ చేస్తోంది. దీంతో 'కుడా'కు కోట్లు విలువ చేసే భూములు అందుబాటులోకి రావడంతోపాటు అభివృద్ధి పనులకు స్థలాలు వినియోగంలోకి తెచ్చినట్లవుతోంది.
భద్రకాళి మట్టితో జీవం..
గత ప్రభుత్వ హయాంలో కొందరు కోట్లు విలువైన భూములను బొందల గడ్డలుగా మార్చారు. ప్రభుత్వ జాగలను టార్గెట్ చేసి గుట్టలు, మొరం, మట్టి తవ్వుకుని దందా చేశారు. దీంతో గ్రేటర్ వరంగల్ లో చాలాచోట్లా సర్కారు స్థలాలు గోతులతో నిరుపయోగంగా మారగా ప్రభుత్వ ప్రాజెక్టులకు అనువైన భూములు దొరక్క ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఇలాగే స్థల సమస్య ఎదురవగా, చివరకు బీఎడ్ కాలేజీ ఆవరణలో బిల్డింగ్ కట్టేందుకు ప్లాన్ చేశారు. ఎలక్ట్రిక్ బస్ డిపో, శిల్పారామం, ఎస్టీపీలు.. ఇలా వివిధ ప్రాజెక్టులకు స్థల సమస్యలు అడ్డంకిగా మారాయి.
ఈ నేపథ్యంలో నిరుపయోగంగా మారిన స్థలాలను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు కుడా చర్యలు చేపట్టింది. ఇప్పటికే భద్రకాళి చెరువు పూడిక తీత పనులు నడుస్తుండగా, ఆ మట్టిని బొందలుగా మారిన స్థలాల్లో నింపి చదును చేస్తున్నారు. ఈ మేరకు దాదాపు రూ.16 కోట్ల వరకు ఖర్చు చేసి భద్రకాళి మట్టితో నగరంలో వివిధ చోట్ల నిరుపయోగంగా మారిన స్థలాలను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. మట్టితో చదును చేయడంతో పాటు ఆయా స్థలాలకు చుట్టూ కాంపౌండ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
23 ఎకరాలు పునర్వినియోగంలోకి..
భద్రకాళి చెరువు పూడికతీత మట్టితో నగరం నడిమధ్యన ఉన్న సర్కారు భూములను చదును చేస్తున్నారు. హనుమకొండ న్యూశాయంపేట శివారు 23, 939 సర్వే నెంబర్లలోని దాదాపు పదెకరాల్లో ఉన్న గుట్ట గతంలో మైనింగ్ వల్ల క్వారీ గుంతగా మారింది. దీంతో ఆ క్వారీని మొత్తం భద్రకాళి మట్టితో నింపేశారు. 10 ఎకరాల భూమిని ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టుకు లేదా కమర్షియల్ కాంప్లెక్స్ కు ఉపయోగపడేలా డెవలప్ చేశారు. హంటర్ రోడ్డు దీనదయాల్ నగర్ లోని గుట్టను కూడా ఇలాగే క్వారీగా మార్చగా, దానిని భద్రకాళి మట్టితో నింపి సుమారు 6 ఎకరాల భూమిని అందుబాటులోకి తెచ్చారు.
నగర శివారులో ఉన్న అమ్మవారిపేట చెరువు చుట్టుపక్కలా మట్టి దందా కారణంగా పెద్ద గుంతలు ఏర్పడగా, దానినీ చదును చేసి దాదాపు 7 ఎకరాల భూమిని పునర్వినియోగానికి అనుకూలంగా మార్చారు. ఇప్పటివరకు నగరంలో కోట్లు విలువైన దాదాపు 23 ఎకరాల భూమిని వివిధ ప్రాజెక్టులకు వినియోగపడేలా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవన్నీ నగరంలో చాలా విలువైన స్థలాలు కాగా, నాలుగైదు వందల కోట్ల వాల్యూ ఉన్న భూములను 'కుడా' పునర్వినియోగానికి అనుకూలంగా మార్చింది.
దీనదయాల్ నగర్ లో శిల్పారామం..!
అందుబాటులోకి తెచ్చిన స్థలాలను వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులకు వినియోగించేలా కుడా ప్లాన్ చేస్తోంది. వరంగల్ నగరంలో శిల్పారామం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉండగా, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సహకారంతో హంటర్ రోడ్డులోని దీనదయాల్ నగర్ లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవల 'కుడా' పునర్వినియోగంలోకి తెచ్చిన దీనదయాల్ నగర్ ల్యాండ్ లోనే దానిని నెలకొల్పేందుకు ప్రతిపాదించినట్లు సమాచారం.
ప్రభుత్వ భూమి ఇంచు కూడా వేస్ట్ కానివ్వం..
నగరంలో నిరుపయోగంగా మారిన ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తున్నాం. వాటిని భద్రకాళి చెరువు పూడిక మట్టితో చదును చేసి ప్రభుత్వ ప్రాజెక్టులకు ఉపయోగపడేలా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే చాలాచోట్లా అక్కరకు రాకుండా పోయిన భూములను రీక్లయిమ్ చేశాం. ప్రభుత్వ భూమి ఇంచు కూడా వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం.
- ఇనుగాల వెంకట్రామిరెడ్డి, కుడా చైర్మన్
