
వరంగల్ జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జిల్లాలోని ఖానాపూర్ మండలం చిలకమ్మా నగర్ దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం తనిఖీలు చేపట్టిన పోలీసులు 23 సంచుల్లో తరలిస్తున్న 723 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ. 3 లక్షల 92 వేలు ఉన్నట్లు తెలిపారు పోలీసులు.
ఈ క్రమంలో గంజాయి తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు వరంగల్ పోలీసులు. నిందితుల దగ్గర నుంచి నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇటీవల ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఆదివారం ( ఆగస్టు 31 ) ఆదిలాబాద్ జిల్లాలో పత్తి చేనులో గంజాయి సాగు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు.
గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ సయ్యద్ ఇమ్రాన్ తెలిపిన ప్రకారం.. నేరడిగొండ మండలం గోవింద్ పూర్ గ్రామానికి చెందిన రాజు జాదవ్, విజేష్ రాథోడ్ చేనులో గంజా యి సాగు చేస్తున్నట్లు సమాచారం అందింది. పోలీసులు వెళ్లి రాజు జాదవ్ పత్తి పంట మధ్యలో 57 గంజాయి మొక్కలు , విజేష్ రాథోడ్ చేనులో 23 గంజాయి మొక్కలు పెంచుతున్నట్టు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. రూ.4 లక్షలు విలువైన 80 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.