ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు అరెస్ట్.. భూ భారతి స్లాట్ బుకింగ్స్ కేసులో వరంగల్ పోలీసుల ఎంక్వైరీ

ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు అరెస్ట్.. 	భూ భారతి స్లాట్ బుకింగ్స్ కేసులో వరంగల్ పోలీసుల ఎంక్వైరీ
  • గుట్ట,రాజాపేటలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని హార్డ్​డిస్క్​లు స్వాధీనం

యాదాద్రి/యాదగిరిగుట్ట, వెలుగు: భూ భారతి స్లాట్ బుకింగ్స్​కేసులో ఇద్దరు ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులను వరంగల్​సీసీఎస్​పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో భూ భారతి స్లాట్ బుకింగ్స్, రిజిస్ట్రేషన్​చార్జీల చెల్లింపుల కేసులో విచారణలో భాగంగా నిందితులను గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి. 

భూముల అమ్మకాలకు భూ భారతి పోర్టల్​లో స్లాట్​బుకింగ్​చేసుకోవాలి. ముందుగా స్టాంప్​డ్యూటీ, రిజిస్ట్రేషన్​చార్జీలు చెల్లించాలి. మీ సేవ, డాక్యుమెంట్ రైటర్లతో పాటు ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు టెక్నాలజీని ఉపయోగించి మోసాలకు పాల్పడుతూ.. స్లాట్​బుక్​తో పాటు   పేమెంట్​కూడా చేస్తున్నారు. అయితే.. ప్రభుత్వ ఖజానాకు డబ్బులు చాలా తక్కువగా జమ అయితున్నట్టు జనగామ జిల్లా ఆఫీసర్లు గుర్తించారు. రూ. లక్ష చెల్లిస్తే రూ. 10 వేలు మాత్రమే వస్తున్నట్టు తేలింది. 

దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా పలువురు మీ సేవ సెంటర్ల నిర్వాహకులను అదుపులోకి తీసుకొని విచారించారు. బుధవారం రాత్రి యాదగిరిగుట్టకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు బస్వరాజు వరంగల్ సీసీఎస్​పోలీసులు అదుపులోకి తీసుకుని, సీపీయూ, హార్డ్​ డిస్క్​లు, ప్రింటర్​ను సీజ్​చేసి తీసుకెళ్లారు. శుక్రవారం రాజాపేటకు చెందిన మరో ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు పాండును అరెస్ట్ చేశారు. వరంగల్​సీసీఎస్​ పోలీసులు బస్వరాజును తీసుకెళ్లినది నిజమేనని, పూర్తి వివరాలు తెలియదని యాదగిరిగుట్ట పోలీసులు తెలిపారు.