
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ లో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఓ కుటుంబానికి చెందిన వారు మూకుమ్మడిగా పంచాయతీ వార్డు మెంబర్ ఇంటి పై దాడులు చేశారు. అంతే కాకుండా ఆయనకు సంబంధించిన దుకాణాన్ని సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటన పెద్దషాపూర్ లో కలకలం సృష్టించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ లో 11 వ వార్డు సభ్యుడు వంశీకి.. ఆయన ఇంటి ఎదురుగా ఉండే గొల్ల మల్లమ్మ కుటుంబానికి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలకు సంబంధించి వంశీ కుటుంబం గతంలో శంషాబాద్ పీఎస్ లో కేసు పెట్టారు. ఈ తరుణంలో రెండు కుటుంబాల మధ్య రాజీ కుదర్చడానికి గొల్ల మల్లమ్మ అనుయాయులు ప్రయత్నించగా వంశీ కుటుంబం ఇందుకు అంగీకరించలేదు. దాంతో ఆగ్రహించిన మల్లమ్మ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా.. రాళ్ళు, ఇనుప చువ్వలతో వంశీ ఇంటిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆయనకు సంబంధించిన బ్యాంగిల్ స్టోర్ ను సైతం ధ్వంసం చేశారు. అయితే ఈ దాడుల వ్యవహారం మొత్తం బ్యాంగిల్ స్టోర్ ముందున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దాంతో మల్లమ్మ కుటుంబ సభ్యులు సీసీ కెమెరాలను సైతం ద్వంసం చేశారు. తన కుటుంబంపై దాడికి పాల్పడిన మల్లమ్మ కుటుంబ సభ్యులపై శంషాబాద్ పోలీసులకు వంశీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

