ప్రభుత్వానికి వార్దా డీపీఆర్‌

ప్రభుత్వానికి వార్దా డీపీఆర్‌

హైదరాబాద్‌, వెలుగు : వార్దా నదిపై బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ఎట్టకేలకు ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు చేరింది. వ్యాప్కోస్‌ సంస్థ ఈ డీపీఆర్‌ను ఏప్రిల్‌లోనే సిద్ధం చేయగా ఆరు నెలల తర్వాత దాన్ని తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో రీ డిజైన్‌ చేసిన తర్వాత తమ్మిడిహెట్టి బ్యారేజీని సర్కారు పక్కనపెట్టింది. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఆ ప్రాజెక్టును అటకెక్కించింది. మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల ప్రజల్లో ఆగ్రహంతో తమ్మిడిహెట్టికి బదులుగా దానికి ఎగువన వార్దా నదిపై బ్యారేజీని నిర్మించి ఆ రెండు జిల్లాల్లోని 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ రూపొందించే బాధ్యతను నాలుగేళ్ల క్రితమే వ్యాప్కోస్‌కు అప్పగించింది. 2018లోనే ఆ సంస్థ లైడార్‌ సర్వే చేసి ప్రిలిమినరీ డీపీఆర్ రెడీ చేసింది. తర్వాత వార్దా ప్రాజెక్టును సర్కారు మళ్లీ పక్కన పెట్టింది. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోందని, నిర్మించకుంటే రాజకీయంగా ఎదురుదెబ్బ తప్పదని ఎమ్మెల్యేలు ఏడాది క్రితం హెచ్చరించడంతో పూర్తి స్టడీ చేసి డీపీఆర్ ఇవ్వాలని సర్కారు వ్యాప్కోస్‌ను కోరింది.

బకాయిలు కట్టనందుకే డీపీఆర్ ఇయ్యలే

వార్దా డీపీఆర్ ను వ్యాప్కోస్ ఏప్రిల్‌లోనే సిద్ధం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తమకు రూ.2 కోట్లకుపైగా బకాయిలు కట్టాల్సి ఉండటంతో డీపీఆర్ ఇవ్వకుండా తమ దగ్గరే పెట్టుకుంది. బకాయిలు ఇవ్వాలంటూ ఆ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా పట్టించుకోలేదు. రెండు వారాల క్రితం మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఎమ్మెల్యేలు వార్దా ప్రాజెక్టుపై నిలదీసినట్టు తెలిసింది. బ్యారేజీ నిర్మించకుంటే ప్రజలు తిరగబడతారని హెచ్చరించినట్టు సమాచారం. ఎమ్మెల్యేల ఆగ్రహంతోనే వ్యాప్కోస్‌ పెండింగ్‌ బిల్లుల్లో కొంత మేరకు చెల్లించి డీపీఆర్ తెప్పించినట్టు తెలిసింది. వార్దా నది ప్రాణహితలో కలిసే చోటుకు 5 కిలోమీటర్ల ఎగువన 632 మీటర్ల బ్యారేజీ నిర్మించనున్నారు. రూ.1000 కోట్లతో నిర్మించే ఈ బ్యారేజీకి 35 గేట్లు అమరుస్తారు. ఏడాది పొడవునా 4 టీఎంసీల నీళ్లు నిల్వ చేస్తారు. ఈ బ్యారేజీ కింద మహారాష్ట్రలో 288 హెక్టార్లు, తెలంగాణలో117 హెకార్ల భూమి మునిగిపోతుందని గుర్తించారు. ఈ డీపీఆర్‌ను త్వరలోనే సీడబ్ల్యూసీతో పాటు జీఆర్‌ఎంబీకి సమర్పించనున్నారు.