వాహ్​ర్నర్​ : బంగ్లాపై ఆసిస్ గ్రేట్ విక్టరీ

వాహ్​ర్నర్​ : బంగ్లాపై ఆసిస్ గ్రేట్ విక్టరీ

సమఉజ్జీల సమరం కాకపోయినా.. చివరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్​లో ఆస్ర్టేలియా పైచేయి సాధించింది. డేవిడ్​ వార్నర్​ (147 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లతో 166) సూపర్​ సెంచరీతో భారీ స్కోరు సాధించిన కంగారూలు.. సంచలనాల బంగ్లాదేశ్​కు చెక్​ పెట్టారు. ఫలితంగా ఐదో విజయంతో సెమీస్​ బెర్త్​కు మరింత చేరువయ్యారు. తనదైన రోజున మేటి జట్లను సైతం మట్టి కరిపించిన బంగ్లా పులులు.. ఈ మ్యాచ్​లోనూ ఆసీస్​కు దడపుట్టించారు.  ముష్ఫికర్​(97 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్​తో 102 నాటౌట్​) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ తో ఆశలు రేకెత్తించినా..  కొండంత లక్ష్యాన్ని కరిగించలేకపోయాడు. ఓవరాల్​గా ఆసీస్​ పదునైన బౌలింగ్​కు సరితూగలేకపోయినా పోరాటంతో మెప్పించిన బంగ్లా.. మూడో ఓటమితో సెమీస్​ అవకాశాలను క్లిష్టం చేసుకుంది.

నాటింగ్హామ్వరల్డ్​కప్​లో ఆస్ర్టేలియా మరోసారి ఆధిపత్యం చూపెట్టింది. దీంతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్​లో ఫించ్​సేన  48 పరుగుల తేడాతో బంగ్లాదేశ్​పై విజయం సాధించింది. టాస్​ గెలిచి బ్యాటింగ్​కు దిగిన ఆసీస్​ 50 ఓవర్లలో 5 వికెట్లకు 381 పరుగులు చేసింది. వార్నర్​కు తోడు  ఖవాజ (72 బంతుల్లో 10 ఫోర్లతో 89), ఫించ్​ (51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53) చెలరేగారు. తర్వాత బంగ్లాదేశ్​50 ఓవర్లలో 8 వికెట్లకు 333 పరుగులకే పరిమితమైంది.  వన్డేల్లో బంగ్లాకు ఇదే అత్యధిక స్కోరు. ముష్ఫికర్​కు తోడుగా మహ్మదుల్లా (50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 69), తమీమ్​ (74 బంతుల్లో 6 ఫోర్లతో 62) రాణించారు. వార్నర్​కు ‘మ్యాన్​ ఆఫ్​ద మ్యాచ్​’ లభించింది.

ముష్ఫికర్​ సెంచరీ

భారీ టార్గెట్​ ఛేజింగ్​లో బంగ్లా టాప్​ ఆర్డర్​ నిలకడగానే ఆడింది. ఓపెనర్లలో సౌమ్య సర్కార్​ (10) రనౌట్​మినహా..  తమీమ్, గత మ్యాచ్​ హీరో షకీబ్​(41) ఇన్నింగ్స్​ను తొందరగానే గాడిలో పెట్టారు. ఆసీస్​ పేస్ అటాక్​ను దీటుగా ఎదుర్కొంటూ  తొలి పవర్​ప్లేలో 53/1 స్కోరు సాధించిపెట్టారు. తర్వాత అడపాదడపా ఫోర్లు కొడుతూ జట్టు స్కోరును 100కు చేర్చారు. రెండో వికెట్​కు 79 పరుగులు జోడించాకా షకీబ్​ను స్టోయినిస్​ పెవిలియన్​కు పంపాడు. తమీమ్​ కూడా రనౌట్​నుంచి గట్టెక్కి65 బంతుల్లో హాఫ్​ సెంచరీ పూర్తి చేశాడు.102/2 స్కోరు వద్ద వచ్చిన ముష్ఫికర్.. తమీమ్​కు మంచి సహకారాన్ని ఇచ్చాడు. జంపా బౌలింగ్​లో భారీ సిక్సర్​తో టచ్​లోకి వచ్చాడు. కానీ తమీమ్​25వ ఓవర్​లో ఔట్​కావడంతో బంగ్లా స్కోరు144/3 కి చేరింది. మూడో వికెట్​కు 42 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

లిటన్​ దాస్​ (20) కుదురుకోవడానికి టైమ్​ తీసుకున్నా.. ఎక్కువసేపు వికెట్​ కాపాడుకోలేకపోయాడు. మూడు ఫోర్లు బాది జంపా బౌలింగ్​లో ఔట్​కావడంతో నాలుగో వికెట్​కు 31 రన్స్​కు తెరపడింది.  ఓవరాల్​గా 30 ఓవర్లు ముగిసేసరికి బంగ్లా 177/4తో ఎదురీత మొదలుపెట్టింది. ముష్ఫికర్​కు జత అయిన మహ్మదుల్లా ఇన్నింగ్స్​లో వేగం పెంచాడు. జంపాను లక్ష్యంగా చేసుకుని చకచకా బౌండరీలు, భారీ సిక్సర్లు కొడుతూ రన్​రేట్​ను పెంచాడు. దాదాపు 16 ఓవర్ల పాటు ఈ ఇద్దరు జోరు చూపడంతో ఇన్నింగ్స్​ సాఫీగా ముందుకెళ్లింది. అయితే 46వ ఓవర్​లో కూల్టర్​నైల్​ (2/58) రెండు బంతుల వ్యవధిలో మహ్మదుల్లా, షబ్బీర్​(0)ను ఔట్​ చేయడంతో పరుగుల వేటలో బంగ్లా వెనుకబడింది. చివరకు 12 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన దశలో మెహిది హసన్​ (6) కూడా ఔటయ్యాడు. అయితే రెండో ఎండ్​లో ఉన్న ముష్ఫికర్​ సెంచరీ పూర్తి చేసినా.. లక్ష్యం పెరిగిపోవడంతో ఓటమి తప్పలేదు.

కుమ్మేసిన వార్నర్​..

తనలో ఉన్న సహజమైన దూకుడుతో భారీ హిట్టింగ్​ చేసిన వార్నర్ బంగ్లా బౌలింగ్​ను ఊచకోత కోశాడు. 12 పరుగుల వద్ద బ్యాక్​వర్డ్​ పాయింట్​లో షబ్బీర్​ క్యాచ్​ వదిలేయడంతో గట్టెక్కిన ఈ లెఫ్టాండర్  మ్యాచ్​ మొత్తంలో​ స్క్వేర్​ లెగ్​, లాంగాన్​, లాంగాఫ్​, మిడ్​వికెట్​లో ఐదు టవరింగ్​ సిక్సర్లు బాదాడు. రెండోఎండ్​లో ఫించ్ కూడా రిస్క్​లేకుండా ఆడటంతో తొలి 10 ఓవర్లలో ఆసీస్ 53 రన్స్​ చేసింది.  జోరు కొనసాగించిన వార్నర్​ 55 బంతుల్లోనే హాఫ్​ సెంచరీ అందుకోగా…  తానేమీ తక్కువ కాదన్నట్లు16వ ఓవర్​లో ఫోర్​, సిక్స్​కొట్టిన ఫించ్​ కూడా 47 బంతుల్లో ఫిఫ్టీ మార్క్​ను సాధించాడు. ఈ ఇద్దరి దూకుడుతో  కంగారూలు 20 ఓవర్లలో 117 రన్స్​ చేసి మెరుగైన స్థితిలో నిలిచారు. ఇక ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని సౌమ్య సర్కార్ (3/58)​ తన తొలి ఓవర్ (21వ)​లోనే విడగొట్టాడు. ఎక్స్​ట్రా బౌన్స్​తో వేసిన ఫుల్​లెంగ్త్​ బంతిని ఆడబోయి ఫించ్… షార్ట్​ థర్డ్​మ్యాన్​లో రూబెల్​కు క్యాచ్​ ఇచ్చాడు.  ఈ దశలో వచ్చిన ఖవాజ విలువైన ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. వార్నర్​ దూకుడును చూపెట్టినా.. తాను మాత్రం నిలకడగా ఆడుతూ వీలైనప్పుడల్లా బంతిని రోప్​దాటించాడు. వికెట్లు తీయలేక చేష్టలుడిగిన బంగ్లా బౌలర్లను వీళ్లిద్దరు మరింత విసిగించారు.

99 రన్స్​ వద్ద షకీబ్​ బంతిని స్క్వేర్​ లెగ్​లోకి పంపిన వార్నర్​కెరీర్​లో 16వ సెంచరీ (109 బాల్స్​) పూర్తి చేశాడు.  ముస్తాఫిజుర్ (1/69)​ ​బాల్​ను  రివర్స్​ స్వింగ్ చేసినా.. ఈ జంట ముందు తేలిపోయాడు. దీంతో ఖవాజ 50 బంతుల్లో 50 మార్క్​ను చేరాడు. 41వ ఓవర్​ నుంచి ఈ ఇద్దరు జోరు పెంచడంతో పరుగులు వేగంగా వచ్చాయి.  ఖవాజ ఐదు ఫోర్లు బాదితే.. వార్నర్​ మాత్రం  రెండు సిక్స్​లు, నాలుగు ఫోర్లతో రెచ్చిపోయాడు. ఇదే జోరులో సౌమ్య (45వ ఓవర్​) వేసిన బౌన్సర్​ను టచ్​చేసి షార్ట్​ థర్డ్​మ్యాన్​లో రూబెల్​కు క్యాచ్ ఇచ్చి వార్నర్​ఔటయ్యాడు. ఈ ఇద్దరి మధ్య రెండో వికెట్​కు 192 పరుగులు జతయ్యాయి. 41 నుంచి 45 ఓవర్ల మధ్య వికెట్ నష్టానికి 58 రన్స్​ సమకూరడంతో ఆసీస్ స్కోరు 300 దాటింది. భారీ పునాదిపై మ్యాక్స్​వెల్​ (10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32) వీరవిహారం చేశాడు. కానీ 47వ ఓవర్​రెండో బంతికి అనూహ్యంగా రనౌట్అయ్యాడు. తర్వాతి ఐదు బంతుల్లో ఖవాజ, స్మిత్​ (1) వెనుదిరిగారు. చివర్లో వర్షం కొద్దిగా అంతరాయం కలిగించినా…  స్టోయినిస్​ (17 నాటౌట్​) మెరుగ్గా ఆడటంతో ఆసీస్​భారీ స్కోరు సాధ్యమైంది.