
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావ… మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2009 ఏడాదిలో నమోదైన ఓ కేసు విచారణలో ఖమ్మం కోర్టుకు హాజరుకాకపోవడం.. వారెంట్ జారీకి కారణమైంది.
ఖమ్మంలోని కరుణగిరి చర్చిలో 2009లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ కరపత్రాలు పంచారనేది అనిల్ పై వచ్చిన ఆరోపణ. దీనిపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో బ్రదర్ అనిల్ పై… మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద కేసు నమోదైంది. 188 ఐపీసీ సెక్షన్ కింద కేసు రిజిస్టర్ అయింది. బ్రదర్ అనిల్.. హైకోర్టులో దీనిపై క్వాష్ పిటిషన్ వేశారు. అనిల్ ను అరెస్ట్ చేయొద్దని.. ఆ మధ్య హైకోర్టు సూచించింది. ఆ తర్వాత.. కేసు సుప్రీంకోర్టుదాకా వెళ్లింది. ఆరు నెలల్లో కేసు క్లోజ్ కాకపోతే… క్వాష్ పిటిషన్ రద్దైనట్టేనంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో.. కేసు విచారణకు హాజరు కావాలని… ఖమ్మం కోర్టు జడ్జి సమన్లు జారీచేశారు. ఈ సమన్లకు కూడా బ్రదర్ అనిల్ నుంచి రిప్లై రాలేదు. విచారణకు హాజరుకాలేదు. దీంతో… అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్టు జారీచేసింది.
వెంటనే కోర్టుకు హాజరుకావాలని బ్రదర్ అనిల్ కు కోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. కోర్టుకు హాజరుకాకపోతే.. పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే.. సోమవారం నాడు కోర్టుకు హాజరుకావాలని బ్రదర్ అనిల్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పదేళ్ల కిందటి ఈ కేసులో.. ఆరోపణలపై వివరణ ఇచ్చుకుంటే న్యాయపరమైన చిక్కులు తొలగుతాయనేది ఆయన సన్నిహితులు చెబుతున్న మాట.